Congress: నేడు దిగ్విజయ్‌ సింగ్ నామినేషన్‌.. గహ్లోత్ వైదొలుగుతారా?

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నిలుస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే

Published : 29 Sep 2022 01:19 IST

దిల్లీ: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నిలుస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌ లాంటి నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. గురువారం ఆయన నామినేషన్‌ వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్‌ పేరు ముందే వినిపించింది. అయితే ఆ పదవి పట్ల తాను ఆసక్తిగా లేనంటూ ఆయన ఆ వార్తలను తోసిపుచ్చారు. కానీ, ప్రస్తుతం రాజస్థాన్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో గహ్లోత్‌ను పోటీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్‌ నేతకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్‌ పేరు మరోసారి పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యుల డిమాండ్‌ మేరకు దిగ్విజయ్‌.. అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ రాత్రికి ఆయన దిల్లీకి చేరుకోనున్నారు.

గహ్లోత్‌ రాజీనామా చేయట్లేదు..!

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బుధవారం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నేడు ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో భేటీ కానున్నారు. రాజస్థాన్‌ సంక్షోభ పరిస్థితులపై ఇప్పటికే ఆయన సోనియాతో ఫోన్‌లో మాట్లాడారు. సమాంతర సీఎల్పీ సమావేశంలో తన ప్రమేయం లేదనీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా వివరించేందుకే నేడు ఆయన దిల్లీ వెళ్లనున్నారు. అయితే హస్తినకు బయల్దేరేముందు ఆయన తన సన్నిహితులతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ సింగ్ మాట్లాడుతూ.. ‘‘గహ్లోత్‌ నాయకత్వంలోనే కాంగ్రెస్‌ పనిచేస్తుంది. నేటి భేటీలో రాజీనామా అంశం చర్చకు రాలేదు. అయితే ఆయన రాజస్థాన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు’’ అని తెలిపారు. దీంతో గహ్లోత్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని