కేంద్ర బడ్జెట్‌ నిరాశకు గురి చేసింది: కాంగ్రెస్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పెదవి విరిచింది. ప్రస్తుత బడ్జెట్‌ మునుపెన్నడూ లేని విధంగా నిరాశకు గురి చేసిందని విమర్శించింది.

Updated : 02 Feb 2021 16:08 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పెదవి విరిచింది. ప్రస్తుత బడ్జెట్‌ మునుపెన్నడూ లేని విధంగా నిరాశకు గురి చేసిందని విమర్శించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెస్‌ విధించడాన్ని తప్పుబట్టింది. వేలాది మంది రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి ‘ప్రతీకార చర్య’గా ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేసింది. సామాన్యులకు సాయం చేసి ధైర్యవంతురాలినని నిరూపించుకోవాల్సిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. మోదీ ప్రభుత్వం భారతదేశానికి చెందిన ఆస్తులను ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెడుతోందంటూ ధ్వజమెత్తారు. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం మర్చిపోయిన మోదీ ప్రభుత్వం.. తన మిత్రులైన పెట్టుబడిదారులకు దేశం ఆస్తులను అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

బడ్జెట్ ప్రసంగంతో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌  ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెస్‌ పెంపు అంశంపై సభలోని ఎంపీలకే అవగాహన లేదని అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చరిత్రలోనే అతి పెద్ద ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారని, దానికి ప్రతీకార చర్యగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెస్‌ విధించారని ఆరోపించారు. ఇది సమాఖ్యవాదానికి గొడ్డలిపెట్టని అన్నారు. సెస్సుల ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో వాటా లభించదని తెలిపారు. ఇది సగటు మానవుడికి ‘ గట్టి దెబ్బ’గా అభివర్ణించారు.

భారత పౌరులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మోసం చేశారని చిదంబరం అన్నారు. ప్రధానంగా పేద ప్రజలు, చిరుద్యోగులు, వలసదారులు, రైతులకు తీరని ఆవేదన మిగిల్చారని విమర్శించారు. చిన్నాచితకా పరిశ్రమలు శాశ్వతంగా మూతపడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. పొరుగుదేశం చైనా నుంచి ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ రక్షణ వ్యవస్థకు స్పష్టమైన కేటాయింపులేవీ జరపలేదని ఆరోపించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు చేస్తామన్నది స్పష్టంగా చెప్పలేదని అన్నారు. రక్షణ వ్యవస్థకు వచ్చే 2 ఏళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాలంలో ఎంత మేర ఖర్చు చేయాలన్న దానిపై స్పష్టత ఉండాలన్నారు.

ఒక దేశం.. ఒకే రేషన్‌ కార్డు, ప్రజారోగ్యానికి కేటాయింపులు తప్ప తాజా బడ్జెట్‌లో చెప్పుకో దగ్గ అంశాలేవీ లేవని, ఈ బడ్జెట్‌ను దేశ ప్రజలు రెండు వారాల్లో మర్చిపోతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని