Hindenburg: అదానీ గ్రూపుపై ఆరోపణలు.. దర్యాప్తు చేయాల్సిందే : కాంగ్రెస్‌

అదానీ గ్రూపుపై (Adani Group) వస్తోన్న ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కాంగ్రెస్‌ పార్టీ (Congress) డిమాండ్‌ చేసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థపై (Economy) ప్రభావం చూపే ఇటువంటి విషయాలపై సెబీ, ఆర్బీఐలు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Updated : 27 Jan 2023 17:29 IST

దిల్లీ: అదానీ గ్రూపు (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అటు స్టాక్‌ మార్కెట్లతో పాటు రాజకీయాల్లోనూ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI), రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, భద్రతలను నిర్దారించే బాధ్యత ఈ రెండు సంస్థలకు ఉన్నందున వీటిపై సీరియస్‌ దర్యాప్తు అవసరమని పేర్కొంది.

‘అదానీ సంస్థకు, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న సన్నిహిత బంధం గురించి పూర్తిగా అర్థం చేసుకోగలం. ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సెబీ, ఆర్బీఐ వంటి సంస్థలు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నించవచ్చేమో కానీ, ప్రపంచీకరణ యుగంలో తప్పుడు పద్ధతిలో వ్యాపారం చేసే వాటిపై హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికను పక్కనపెట్టగలమా..? అని ప్రశ్నించారు.

మరోవైపు అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూపు.. ఈ నివేదిక తమ గ్రూపుతోపాటు వాటాదార్లు, మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపిందని, భారత పౌరుల్లోనూ అనవసర భయాలను సృష్టించిందని పేర్కొంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూపు షేర్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని