‘7 ఏళ్లలో సిలిండర్‌ ధర డబుల్‌.. ఇదేనా అచ్చేదిన్‌’.. భాజపాపై కాంగ్రెస్‌ ఫైర్‌

Congress on LPG price: వంటకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను పెంచడంపై మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.​​​​​​

Published : 02 Sep 2021 01:18 IST

దిల్లీ: వంటకు వినియోగించే ఎల్పీజీ సిలిడర్‌ ధరను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై సిలిండర్‌ రూపంలో మరో భారం మోపడాన్ని ఆ పార్టీ ఖండించింది. గత రెండు నెలల్లో వరుసగా మూడోసారి గ్యాస్‌ సిలిండర్‌పై రూ.25 చమురు సంస్థలు పెంచిన నేపథ్యంలో బుధవారం ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఒకవైపు దేశ ప్రజలను ఆకలి మంటల్లో పడుకోబెడుతూ... తన స్నేహితుల నీడలో ఒకరు నిద్రపోతున్నారంటూ మోదీనుద్దేశించి రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవుతోందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో మారుతూ వస్తున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరల వివరాలను చూపించే పట్టికను ఆయన ట్వీట్‌ చేశారు. #IndiaAgainstBJPLoot అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ ప్రచారం ప్రారంభించింది.

గడిచిన ఏడేళ్లలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రెండింతలైందని ఆ పార్టీ అధికారప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శించారు. దేశాన్ని దోచుకునేందుకు భాజపాకు అచ్చేదిన్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. 2014 మార్చి 1న సిలిండర్‌ ధర రూ.410 ఉండగా.. అది ఇప్పుడు రూ.884కి చేరిందని విమర్శించారు. దేశంలో రెండు రకాల అభివృద్ధి కనిపిస్తోందని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఒకటి మోదీజీ స్నేహితుల సంపద, రెండోది సామాన్యులు కొనుగోలు చేసే నిత్యావసర ధరల్లో అంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన హ్యాష్‌ట్యాగ్‌కు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా వందలాదిమంది పెరిగిన వంట గ్యాస్‌ ధరలను నిరసిస్తూ వీడియో సందేశాలు పంపారని ఆ పార్టీ సోషల్‌మీడియా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ రోహన్‌ గుప్తా పేర్కొన్నారు. గడిచిన 8 నెలల్లో 67 సార్లు చమురు ధరలు పెంచారని, గ్యాస్‌ సిలిండర్‌ ధర ఒక్క ఏడాదిలోనే 50శాతం పెరిగిందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని