Himachal Pradesh: విజయం సరే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందు ‘సీఎం’ సవాల్..!

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ కొత్త ఎమ్మెల్యేలతో నేడు సమావేశం నిర్వహించనుంది.

Published : 09 Dec 2022 13:48 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఇప్పుడు తదుపరి సవాల్‌ను పరిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అదే.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం. ఈ పదవికి ఆశావహుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి పార్టీని, రాష్ట్రాన్ని ముందు నడిపించే వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టడం హస్తం పార్టీకి పెద్ద సవాలే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎవరి అంచనాలు వారివే..

హిమాచల్‌లో ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌లో అనేకమంది నేతలు ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ (Pratibha Singh) (దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య, మండీ ఎంపీ), కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధిపతి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, మాజీ విపక్షనేత ముఖేశ్‌ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు కుల్‌దీప్‌ సింగ్ రాఠోడ్‌, ఠాకుర్‌ కౌల్‌సింగ్‌, ఆశాకుమారి, హర్షవర్ధన్‌ చౌహన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీఎం పదవికి తాము అర్హులమేనంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటుండటం కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో విడిపోయిన పార్టీని తిరిగి ఏకం చేసేందుకు తాను ఎంతగానో కృషి చేశానని కుల్‌దీప్‌ సింగ్‌ చెబుతున్నారు.

తమను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్న ఆశతోనే చాలా మంది కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల్లో పోటీ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో చాలా మంది అభ్యర్థులు ఈ విషయాన్ని తమ ప్రచారానికి వాడుకున్నారు. దీనిపై అప్పట్లో భాజపా విమర్శలు చేసింది కూడా..!

సీఎం బాధ్యతలకు సిద్ధమే: ప్రతిభా సింగ్‌

ముఖ్యమంత్రి రేసులో దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ పదవికి తాను అర్హురాలినేనని ఆమె కూడా ప్రకటించారు. ‘‘ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీకి నాయకత్వం వహించే బాధ్యతను సోనియాజీ, కాంగ్రెస్‌ హైకమాండ్‌ నాకు అప్పగించింది. దాన్ని నేను విజయవంతంగా నిర్వర్తించాను. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కూడా నడిపించగలననే విశ్వాసం ఉంది. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా నాకు ఉంది’’ అని ప్రతిభా సింగ్‌ మీడియాకు వెల్లడించారు. అటు వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ తాజా ఎన్నికల్లో శిమ్లా రూరల్‌ నుంచి విజయం సాధించారు. సీఎం ఎంపిక విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఓ కొడుకుగా తన తల్లికి పెద్ద బాధ్యత రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తామని తెలిపారు.

కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ శుక్రవారం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అప్పగిస్తూ వారంతా శిమ్లాలో ఏకవాక్య తీర్మానం చేయనున్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటినుంచో వస్తోన్న సంప్రదాయం. ఖర్గే అధికారికంగా శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని