Congress: ప్రగతిభవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతల యత్నం.. గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టి సీజ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

Updated : 14 Dec 2022 14:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టి సీజ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌ వద్ద ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పలువురు ముఖ్యనేతలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రగతిభవన్‌ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీగా పోలీసులను మోహరించి గాంధీభవన్‌ గేటు వద్దే నేతలు, కార్యకర్తలను నిలువరించారు. దీంతో నేతలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. నోటీసులివ్వకుండా ఎందుకు తనిఖీలు చేశారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే..

ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల ద్వారా సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని.. మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఇటీవల ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని సోనాలి స్పాజియో టవర్స్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అక్కడి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకునేందుకు యత్నించారు. 

సమాచారం అందడంతో కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి తదితరులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ పార్టీ కార్యాలయానికి ఎందుకొచ్చారని, నోటీసులు చూపించాలని నిలదీశారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లు రవి, షబ్బీర్‌ అలీ, మహేశ్‌గౌడ్‌లతోపాటు మరికొందరు నేతల్ని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా స్వల్పంగా తోపులాట జరిగింది. కార్యాలయం దగ్గర కార్యకర్తలు బైఠాయించారు. అయినా పోలీసులు సోదాలు కొనసాగించారు. కంప్యూటర్‌ సీపీయూలను, పత్రాలను తమ వెంట తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని