Congress: ఆ వ్యాఖ్యలపై 7 రోజుల్లో వివరణ ఇవ్వండి.. సునీల్ జాకర్‌కు కాంగ్రెస్‌ నోటీసులు

పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ చన్నీని లక్ష్యంగా చేసుకొని మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాకర్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ....

Published : 11 Apr 2022 19:28 IST

చండీగఢ్‌: పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జిత్‌ చన్నీని లక్ష్యంగా చేసుకొని మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాకర్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళిత సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన అభ్యంతరకరమైన భాష వాడారంటూ ఇప్పటికే ఆయన దిష్టిబొమ్మ దహనం చేసిన దళిత సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు.. జాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనకు సోమవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది.

గత వారంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాకర్‌ అమరీందర్‌ రాజీనామాతో ఆ స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం చన్నీని నియమించడాన్ని ప్రశ్నించినట్టు వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఎవరిని ఎక్కడ ఉంచాలో నాయకత్వం తెలుసుకోవాలి’ అంటూ పరోక్షంగా చన్నీని ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దళిత సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జాకర్‌ అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆయనపై దళిత కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు, సునీల్‌ జాకర్‌ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ వెర్కా మండిపడ్డారు. దళిత వర్గంపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనీ.. పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అమరీందర్‌ సింగ్‌ అనూహ్యంగా రాజీనామా చేశాక చన్నీని సీఎం చేయడంతో జాకర్‌ కలత చెందారన్నారు.

 అయితే, మాజీ ఎమ్మెల్యే వెర్కా చేసిన ఆరోపణలపై సునీల్ జాకర్‌ స్పందించారు. తాను అన్ని మతాలు, వర్గాలనూ ఎప్పుడూ గౌరవిస్తానన్నారు. అట్టడుగు వర్గాల కోసం ఎప్పుడూ పోరాడానన్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని జాకర్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు