Uddhav Thackeray: నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడే ఆ కుట్రకు ప్లాన్‌: ఉద్ధవ్‌

శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్పత్రిలో చేరి కదల్లేని స్థితిలో ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు ప్రణాళికలు ......

Published : 27 Jul 2022 01:03 IST

ముంబయి: శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్పత్రిలో చేరి కదల్లేని స్థితిలో ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు ప్రణాళికలు జరిగాయన్నారు. శివసేన నుంచి శిందే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి తమ అధికార పత్రిక ‘సామ్నా’ ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) వర్గంతో పాటు భాజపాలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆస్పత్రిలో తాను కదలలేని స్థితిలో ఉన్న సమయంలోనే పన్నాగం రచించారని.. తన శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వారి కదలికలు చురుగ్గా సాగాయన్నారు. ఒకవేళ తాను శిందేను సీఎంని చేసినా సరే అతడి ఆలోచనలు దుర్మార్గమైనవేనంటూ విరుచుకుపడ్డారు. వాళ్లను నమ్మడమే తాను చేసిన పెద్ద తప్పన్నారు. తన తండ్రి పేరుతో ప్రజలను ఓట్లు అర్జించవద్దని శిందే వర్గానికి సూచించారు. కుళ్లిపోయిన ఆకులు చెట్టు నుంచి రాలిపోవాల్సిందేనని.. ఆ చెట్టు నుంచి సర్వస్వం పొందినవారే చివరకు దాన్ని వదలేస్తున్నారంటూ శిందే వర్గాన్ని ఉద్దేశించి ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. సామాన్యుల నుంచే అసాధారణ నేతలను తయారు చేస్తామన్నారు. అలాగే, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపాపైనా విరుచుకుపడ్డారు. 2019లో తన డిమాండ్లను అంగీకరించి ఉంటే భాజపాకు ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. భాజపా ఇప్పుడేం చేసింది.. 2019లో అదే చేసి ఉంటే గౌరవప్రదంగా సాగడంతో పాటు వాళ్లు ఇప్పుడు అదనంగా ఖర్చు చేసిన కోట్ల రూపాయలు సైతం మిగిలేవన్నారు.

మహారాష్ట్రకు దిల్లీయే వెన్నుపోటు పొడిచిందన్న ఉద్ధవ్‌.. ఆదుకున్నవారినే అంతం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హిందువుల మధ్య ఐక్యతను దెబ్బకొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. హిందుత్వలో మరో భాగస్వామి ఉండకూడదన్న ఉద్దేశంతోనే శివసేనను అంతం చేయాలని చూస్తున్నారని.. ఠాక్రేల నుంచి శివసేనను వేరు చేయాలనుకొంటున్నారని ఉద్ధవ్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ల సారథ్యంలో 2019లో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ ప్రయోగం తప్పయితే ప్రజలే తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్లని ఉద్ధవ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు