కోర్టులు ప్రధానిని నియమించలేవ్‌! : ఓలీ

నేపాల్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ప్రధాని ఓలీ సమర్థించుకున్నారు. న్యాయస్థానాలు ప్రధానిని నియమించలేవని, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి సుప్రీం కోర్టు తలదూర్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని ఓలీ సిఫారసు మేరకు నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ బండారీ కేవలం 5 నెలల వ్యవధిలోనే రెండో సారి మే 22న ప్రభుత్వాన్ని...

Published : 18 Jun 2021 01:33 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తాను తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని ప్రధాని ఓలీ సమర్థించుకున్నారు. న్యాయస్థానాలు ప్రధానిని నియమించలేవని, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి సుప్రీంకోర్టు తలదూర్చలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని ఓలీ సిఫారసు మేరకు నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ కేవలం 5 నెలల వ్యవధిలోనే రెండో సారి మే 22న ప్రభుత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. నవంబరు 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. నేపాల్ రాజ్యాంగంలోని అధికరణ 76(7) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్ష సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా జూన్‌ 6న ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాలకు సర్వోన్నత న్యాయస్థానం షోకాజు నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దీనిపై ప్రధాని ఓలీ వివరణను అటార్నీ జనరల్‌ సుప్రీం కోర్టుకు ఇవాళ వివరించారు. ‘‘ రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా నడచుకుంటూ తీర్పులనివ్వడమే కోర్టుల బాధ్యత. అంతేగానీ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో అవి ఎలాంటి పాత్ర పోషించలేవు’’ అని ఓలీ తన వివరణలో పేర్కొన్నారు. ప్రధాని నియామకం అనేది పూర్తిగా రాజకీయ, కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమని ఆయన అన్నారు.

మరోవైపు ప్రభుత్వరద్దు అంశంపై దేశాధ్యక్షురాలి ప్రమేయాన్ని ఓలీ సమర్థించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) ప్రకారం ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం అధ్యక్షురాలికి ఉందని తన వివరణలో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తిని శాసనవ్యవస్థగానీ, న్యాయవ్యవస్థ గానీ ప్రశ్నించాలన్న నిబంధనేమీ లేదని అయన అన్నారు. పార్లమెంట్‌ను రద్దు చేయడంపై విపక్షాలు సుప్రీంలో దాదాపు 30 రిట్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రధాని ఓలీ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారంటూ ఆరోపించాయి. దీనిపై సుప్రీం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జూన్‌ 23కి వాయిదా వేసింది.

గత ఏడాది డిసెంబరులో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. పార్లమెంటులో బల నిరూపణ చేసుకోలేక  ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో ఓలీ మే 14న ప్రధానిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. కానీ, అధికార పక్షానికి చెందిన నాయకులే మరో కూటమిగా ఏర్పడి.. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మే 22న మరోసారి రాజీనామా చేశారు. పార్లమెంటును పూర్తిగా రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. ఈ మేరకు నవంబరు 12,19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆమె నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని