Telangana News: భాజపా వ్యతిరేక పోరాటంలో తెరాసకు మద్దతు: నారాయణ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

Updated : 04 Feb 2022 14:10 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వ్యవసాయానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని.. రైతాంగంపై వారికి ప్రేమ లేదని విమర్శించారు. మఖ్దూంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ఆరోపించారు. రైతులపై ప్రతీకారంతోనే బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రం ఆహ్వానిస్తోందని.. అయితే వాటిలో రిజర్వేషన్లు సామాన్యులకు అందుబాటులో ఉండవని చెప్పారు. బడ్జెట్‌లో విద్య, వైద్యానికి సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు.

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని నారాయణ మండిపడ్డారు. కార్పొరేట్‌ కంపెనీలపై ఒక్కశాతం పన్ను విధిస్తే దేశంలోని సమస్యలు తీరుతాయన్నారు. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన నారాయణ.. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు. భాజపా వ్యతిరేక పోరాటంలో తెరాసకు మద్దతిస్తామని.. జాతీయ స్థాయిలో ఆ పార్టీని కలుపుకొని పోతామని చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై జరిగిన దాడిపట్ల సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. 317 జీవోతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే దాన్ని సవరించాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని