Andhra News: కేటీఆర్‌ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సీపీఐ నారాయణ

ఏపీ రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

Updated : 30 Apr 2022 10:43 IST

చిత్తూరు: ఏపీ రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రులు తప్పుబడుతున్న నేపథ్యంలో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్ర- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఏపీ రోడ్ల దుస్థితి, తమిళనాడు రోడ్ల గురించి వీడియోల్లో ఆధారాలతో సహా వివరించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని.. పక్క రాష్ట్ర రహదారులు చక్కగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. నగరి మండలంలో తన స్వగ్రామమైన అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని నారాయణ తెలిపారు.

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్‌ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్‌ అర్ధరాత్రి సమయంలో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని