Andhra News: చంద్రబాబు, పవన్‌ కలిస్తే మంచిదే.. భాజపా సంగతేంటి?: సీపీఐ

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అండతోనే జగన్‌.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Published : 19 Oct 2022 20:01 IST

రాజమహేంద్రవరం: ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పోరాటం చేస్తామన్న చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రకటనను సీపీఐ స్వాగతించింది. వైకాపాలాంటి అరాచక శక్తులను ఎదుర్కోవాలంటే కలిసి పనిచేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. అయితే, భాజపా విషయంలో తెలుగుదేశం వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. భాజపా అండతోనే వైకాపా రెచ్చిపోతుందనే విషయం గుర్తించాలని సూచించారు.

‘‘జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రజాసంఘాన్ని, ఏ పార్టీని బతకనివ్వడంలేదు. ఎవరూ రోడ్డెక్క కూడదు, ధర్నా చేయకూడదు, ర్యాలీ చేయొద్దు, చలో విజయవాడ అనకూడదు, చలో అసెంబ్లీ అనొద్దంటారు. సీపీఐ మహాసభలు పెట్టుకుంటామంటే బీఆర్టీఎస్‌ రోడ్డు కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో జగన్‌ మోహన్‌రెడ్డి దుర్మార్గమైన పరిపాలన కేంద్రం వత్తాసు లేకుండానే జరుగుతోందా? పెళ్లి చేసుకోనిమాట నిజమే.. కానీ, ఇద్దరూ (వైకాపా, భాజపా) కలిసి కాపురం చేస్తున్నారు. వైకాపా ఎంపీలు అయినదానికి కానిదానికీ కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు. భారత దేశంలో ఏ స్టాండింగ్‌ కమిటీకి లేనన్ని శాఖలు.. విజయసాయిరెడ్డి ఛైర్మన్‌గా కమిటీకి ఇచ్చారు. అక్కడ అధికారంలో ఇద్దరూ పాలుపంచుకుంటున్నారు.

కేంద్రం సహకారం లేకపోతే సీబీఐ అధికారులు స్తబ్దుగా ఉండేవాళ్లా? జగన్‌ కేసుల విషయంలో ఏం చేస్తున్నారు? వైఎస్‌ వివేకానందరెడ్డి సీబీఐ కేసు ఏమైంది. మూడున్నరేళ్లయినా ఎందుకు తేల్చడం లేదు. ఎందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో పులివెందులలో పిల్లాడిని అడిగినా చెబుతారు. సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అండతోనే జగన్‌.. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్నాడు. దానిపై క్లారిటీ తీసుకోవాలి. రాష్ట్రం, ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. కచ్చితంగా నిజమైన ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి, పోరాటంలో ముందుకు రావాలి’’ అని రామకృష్ణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని