BV Raghavulu: కేటీఆర్‌ అలా స్పందించడం రాజకీయం కాదు.. లొంగుబాటు: బీవీ రాఘవులు

దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు.

Updated : 10 Jul 2024 13:32 IST

హైదరాబాద్‌: దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. రష్యా పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో ఇష్యూ టు ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్‌ అన్నారని రాఘవులు గుర్తుచేశారు. అలా స్పందించడం రాజకీయం కాదు.. లొంగుబాటు అని వ్యాఖ్యానించారు. భారాసకు మనుగడ ఉండాలంటే భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

‘‘సీట్లు ఎందుకు తగ్గాయనే ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకోకుండా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలను భాజపా డబ్బుతో ముంచేసింది. తెలంగాణలో ఆ పార్టీ ఓటు బ్యాంకు 19 నుంచి 35 శాతానికి పెరగడం ప్రమాదకరం. రాష్ట్రంలో భాజపాను నియంత్రించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. కేరళలో కాషాయ పార్టీ ఒక్క సీటు సాధించడం చింతించాల్సిన విషయం. అక్కడ కమ్యూనిస్టులను కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా చూసినందునే భాజపా గెలిచింది. కార్పొరేట్‌ శక్తులకు సేవకుడిగా మోదీ వ్యవహరిస్తున్నారు. 

ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్లడంలో సీపీఎం చేసిన త్యాగం మరెవరూ చేయలేదు. పశ్చిమబెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్‌ సీట్లు సర్దుబాటు చేసుకున్నా కాంగ్రెస్‌కు చెందిన ఏ ఒక్క జాతీయ నాయకుడూ ప్రచారం నిర్వహించలేదు. ఓట్లు, సీట్లు కాదు.. దేశాన్ని రక్షించుకోవడమే సీపీఎం లక్ష్యం. మతోన్మాదాన్ని తెలంగాణ ప్రజల మనసు నుంచి తీసివేసే బాధ్యత సీపీఎంపై ఉంది. తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా.. గద్దెనెక్కుదామని భాజపా కాచుక్కూర్చుంది. ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టేందుకు లౌకికశక్తులను సీఎం రేవంత్‌రెడ్డి ఏకం చేయాల్సిన అవసరముంది. ప్రజలపై కేంద్రం మోపిన భారాన్ని మరిచిపోయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కిషన్‌రెడ్డి చదువుతున్నారు’’ అని రాఘవులు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని