Rivaba: గుజరాత్‌ ఎన్నికలూ టీ20లాగే.. నా భార్యకు మద్దతుగా నిలవండి: రవీంద్ర జడేజా

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో తన భార్య రివాబా(Rivaba) పోటీ చేయడంపై క్రికెటర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) స్పందించారు.

Published : 15 Nov 2022 01:37 IST

జామ్‌నగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో తన భార్య రివాబా(Rivaba) పోటీ చేయడంపై క్రికెటర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) స్పందించారు. ఈ ఎన్నికల్లో భాజపా తరఫున జామ్‌నగర్‌ (నార్త్‌) సీటు నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. సోమవారం జామ్‌నగర్‌లో రివాబా నామినేషన్‌ వేయడానికి ముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రవీంద్ర జడేజా మాట్లాడారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రివాబా మున్ముందు అన్నీ నేర్చుకుంటారన్నారు. ఇందులో పురోగతి సాధిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రివాబాది సహాయపడే స్వభావమని.. ఎప్పుడూ ప్రజలకు సాయం చేయాలనుకుంటుందని తెలిపారు. అందుకే ఆమె రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మరోవైపు, సోమవారం రివాబా తన నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో మాజీ సీఎం విజయ్‌ రూపానీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. ఆదివారం రవీంద్ర జడేజా తన భార్యకు మద్దతుగా ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘గుజరాత్ ఎన్నికలు వచ్చేశాయి.. ఇవి టీ20 మ్యాచ్ లాంటివే. నా భార్య భాజపా టిక్కెట్‌పై రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. సోమవారం నామినేషన్‌ వేస్తున్నారు. జామ్‌ నగర్‌ ప్రజలు, క్రికెట్‌ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని