Congress Crisis: రాజకీయ అనిశ్చితి.. రాజస్థాన్‌ మరో పంజాబ్‌గా మారనుందా?

దాదాపు రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. గతంలో పంజాబ్‌లో అస్థిరతతో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు రాజస్థాన్‌లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభానికి కారణాలు వేరయినప్పటికీ..

Published : 27 Sep 2022 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. గతంలో పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతతో చోటుచేసుకున్న పరిణామాలతో ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు రాజస్థాన్‌లోనూ అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నట్టు కనబడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభానికి కారణాలు వేరైనా.. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద సవాలేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్‌ సింగ్‌ స్థానంలో  అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు రాజస్థాన్‌లోనూ  2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అక్కడ కొనసాగుతున్న ప్రస్తుత సంక్షోభం ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రిని మార్చేందుకు ఇరు రాష్ట్రాల్లో కారణాలు వేరైనప్పటికీ ఇది కాంగ్రెస్‌ అధిష్ఠానం లోతుగా ఆలోచించాల్సిన విషయమే!

రాజస్థాన్‌లో ఇలా..

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన గహ్లోత్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ఒకే వ్యక్తికి..ఒకే పదవి’ అంటూ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‌ నేతల్ని సందిగ్ధావస్థలోకి నెట్టింది. దీంతో ఒకవేళ గహ్లోత్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. అయితే, ఆ పార్టీ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌కు సీఎం పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని గహ్లోత్‌ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే దాదాపు 90మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమంటూ అధిష్ఠానానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండా అధిష్ఠానం ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. రాజస్థాన్‌లో సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీ పరిశీలకులుగా ఉన్న సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ చర్చలు కొనసాగిస్తున్నా.. పెద్దగా ప్రయోజనం లేనట్లు కనిపిస్తోంది.

మరోవైపు, రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 108స్థానాలు గెలుచుకుంది. ఇందులో 87మంది ఎమ్మెల్యేలు గహ్లోత్‌కు మద్దతుదారులు కాగా.. వీరంతా గహ్లోత్‌ రాజీనామా చేయాల్సి వస్తే ఆయన వర్గంలోనే ఎవరికైనా సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సచిన్‌ పైలట్‌కు కేవలం 18 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో  నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది. ఒకవేళ సచిన్‌ పైలట్‌ను కాదని నిర్ణయం తీసుకుంటే ఆయన తిరుగుబావుటా ఎగురవేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

పంజాబ్‌లో అలా...!

దాదాపు రెండేళ్ల క్రితం పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌కు దాదాపు రాజస్థాన్‌లోని పరిస్థితులే ఎదురయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ మొత్తం 117 స్థానాల్లో 77 సీట్లతో తిరుగులేని విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో అమరీందర్‌ సింగ్‌, సిద్ధూ మధ్య తరచూ అభిప్రాయబేధాలు తలెత్తడంతో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీకి శరాఘతంలా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సిద్ధూతోపాటు కొందరు ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం అమరీందర్‌ సింగ్‌ పనితీరును రివ్యూ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చలేక పోయినట్లు తేల్చింది.

ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అండదండలతో 2021 మే నెలలో సిద్ధూ పంజాబ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అక్కడికి కొద్ది రోజులకే సెప్టెంబరులో అమరీందర్‌ సింగ్‌ స్థానంలో చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీన్ని అవమానంగా భావించిన అమరీందర్‌ ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సొంతగా పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇటీవల పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఆ ఎన్నికల్లో అమరీందర్‌ కూడా రాణించలేకపోయారు. దీంతో తన పార్టీని భాజపాలో విలీనం చేసి, తాను కూడా అందులోనే చేరిపోయారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్‌లోనూ పంజాబ్‌ తరహా పరిస్థితులే ఎదురుకావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని