Published : 20 Jul 2022 14:28 IST

GST: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచడం క్రూరమైన చర్యే..!

కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ విపక్షాలు

దిల్లీ: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ (GST) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రూరమైనదేనని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రభుత్వ చర్యలు ద్రవ్యోల్బణం (Inflation) మరింత పెరగడానికి దారి తీస్తాయని పేర్కొంది. ఆహార వస్తువులపై జీఎస్టీ పెంపును సమర్థించుకున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై విరుచుకుపడిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌.. ఆరోగ్యవంతమైన ప్యాకింగ్‌ వస్తువులు కొనాలనుకునే వారి ఆకాంక్షలను చంపుతున్నట్లేనని ఆరోపించారు.

‘వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం 7శాతానికి పైగా ఉండటం, హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (WPI) ద్రవ్యోల్బణం 15శాతం, నిరుద్యోగం రేటు భారీగా ఉండడం, రూపాయి విలువ క్షీణిస్తుండటం, ద్రవ్యోల్బణం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ధరలు మరింత పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా పన్నులను పెంచడం క్రూరమైన చర్య’ అని జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రీ-ప్యాకేజ్‌డ్‌, లేబుల్‌ ఉన్న వస్తువులను సామాన్య, పేద ప్రజలు కొనకూడదా? అంటూ ప్రశ్నించారు.

మరోవైపు నిత్యావసరాల వస్తువులపై జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టాయి. పెరుగు, బ్రెడ్‌, పన్నీర్‌ వంటి ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, తెరాస, డీఎంకే, లెఫ్ట్‌ పార్టీలు నినాదాలు చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ పన్నులను గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ (GST)గా పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధీర్‌ రంజన్‌ ఛౌదురిలతోపాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని