Congress: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక భేటీ రేపే

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు.....

Published : 12 Mar 2022 18:03 IST

దిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. పంజాబ్‌లో అధికారం కోల్పోవడంతో పాటు ఇతర నాలుగు రాష్ట్రాల్లోనూ పేలవమైన ప్రదర్శనే కనబరిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ పనితీరును సమీక్షించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో జరగబోయే ఈ కీలక భేటీలో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీలో కొంతకాలంగా సంస్థాగత, నాయకత్వ మార్పును బలంగా కోరుతున్న జీ-23 నేతలు నిన్న దిల్లీలో మాజీ ఎంపీ గులామ్‌ నబీ ఆజాద్‌ నివాసంలో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎంపీలు ఆనంద్‌ శర్మ, కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారీ తదితరులు హాజరైన ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుతో పాటు తమ భవిష్యత్తు వ్యూహంపైనా వీరు చర్చించినట్టు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీకి ముందు జీ23 నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని