Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీ చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు.

Updated : 13 Dec 2022 14:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్‌ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామోదర రాజనర్సింహ మాట్లాడారు. 

సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయట పెడతాం..

‘‘పార్టీ పదవుల విషయంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు అన్యాయం జరిగింది. జిల్లాల వారీగా పార్టీ నాయకుల పనితీరును అంచనా వేసిన దాఖలాలు లేవు. విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ‘భారత్‌ జోడో యాత్ర’ విజయవంతంగా జరిగింది. కోవర్టులు ఉండటం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. వారికి పార్టీలోని అగ్రనేతలు ఎందుకు మద్దతుగా ఉంటున్నారు? కోవర్టులని తెలిపే ఆధారాలు ఉన్నాయి.. అవి కూడా చూపించాం. సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయటపెడతాం. పదవులు ఇవ్వొద్దని మేం అనడం లేదు. ఇచ్చేవాళ్లకి అర్హత ఉందో లేదో విశ్లేషణ, అధ్యయనం చేశాక ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాం. 

పార్టీలో ప్రక్షాళన జరగాలి

కాంగ్రెస్‌ మాకు మాతృ పార్టీ. దాన్ని కాపాడుకోవాలనే ఆశతో ఉన్నాం. పదవులు ఉన్నా లేకున్నా ఆత్మగౌరవంతో బతుకుతాం. మా అందరిదీ ఒకటే విజ్ఞప్తి.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులను సవరించాలి. కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలి. లేకపోతే భవిష్యత్‌లో నష్టపోవాల్సి వస్తుంది. నిరుత్సాహ పరిచేందుకు ఇలా మాట్లాడటం లేదు.. ఇవి వాస్తవాలు. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా’’ అని దామోదర రాజనర్సింహ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని