Congress Vs SP: కూటమిపై కొట్లాట..కాంగ్రెస్‌ వద్దు.. మేం లేకుండా ఎలా?

భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress)కు సమదూరం పాటించాలని గతంలో చెప్పిన ఎస్పీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. పొత్తుల అంశంలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై కాంగ్రెస్‌ స్వయంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Published : 20 Mar 2023 01:37 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. భాజపా (BJP)తోపాటు కాంగ్రెస్‌ (Congress)కు కూడా సమదూరం పాటించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh yadav) నిర్ణయించారు. రెండు రోజుల క్రితం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తో సమావేశం అనంతరం కూడా ఇదే విషయాన్ని చెప్పారు. భాజపాను ఓడించేందుకు తృణమూల్‌ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై కోల్‌కతాలో మరోసారి స్పందించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై కాంగ్రెస్‌ స్వయంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.  ఓ వైపు కాంగ్రెస్‌కు దూరంగా ఉంటామని చెబుతూనే.. ఆ పార్టీ నిర్ణయాన్ని బట్టి తమ తర్వాతి అడుగులు ఉంటాయని పరోక్షంగా చెప్పారు.

మరోవైపు కూటమి ఏర్పాటు విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ కూడా స్పందించారు. కాంగ్రెస్‌ లేకుండా ఏ కూటమిని ఏర్పాటు చేసినా అది వ్యర్థమే అవుతుందని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్‌ అందులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పిన ఆయన.. పొత్తుల గురించి మాట్లాడేందుకు చాలా సమయం ఉందని అన్నారు. ‘ఎన్నో కూటమలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌..కానీ బలమైన కూటమి ఏర్పడాలంటే అందులో కాంగ్రెస్‌ కచ్చితంగా ఉండాల్సిందే’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

అమేథీలో పోటీ చేస్తాం

మరోవైపు గాంధీ కుటుంబీకులకు కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి ఈసారి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశముందని అఖిలేశ్‌ యాదవ్‌ హింట్‌ ఇచ్చారు. 1996 నుంచి ఈ స్థానానికి ఎస్పీ ప్రాతినిధ్యం వహించడం లేదు. 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి రాహుల్ గాంధీపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి మరో కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి  సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈ రెండు స్థానాలకు గతంలో అభ్యర్థులను నిలబెట్టని సమాజ్‌వాదీ పార్టీ.. కాంగ్రెస్‌ విజయానికి కృషి చేస్తుండేది. అయితే, ఎస్పీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అందువల్ల ఈ స్థానాల్లో ఈసారి కచ్చితంగా అభ్యర్థులను నిలబెట్టాలని కార్యకర్తలను నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని అఖిలేశ్‌ చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అప్పుడు కాంగ్రెస్‌.. ఇప్పుడు భాజపా

ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాల నేతలపై కేంద్రం సీబీఐ, ఈడీ,ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సంస్థలను ఉసిగొల్పుతోందని అఖిలేశ్‌ గత కొంతకాలంగా విమర్శిస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను దర్యాప్తు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోందన్న ఆయన... దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియానే అందుకు ఉదాహరణ అని చెప్పారు. భాజపాకి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే కాషాయ పార్టీకి కూడా పడుతుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం గతంలో కాంగ్రెస్‌ కూడా ఇలాగే దర్యాప్తు సంస్థలను వినియోగించుకుందన్న అఖిలేశ్‌.. ఇప్పుడు భాజపా కూడా అదే పని చేస్తోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని