BJP Vs BJP: తెరపైకి కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. ఇంతకు ఏం జరిగింది..?

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల గ్రామాల వివాదం మరోసారి చర్చనీయాంశమయ్యింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు ప్రకటనలు చేయడంతోపాటు దీనిపై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Published : 25 Nov 2022 01:34 IST

ముంబయి: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో భాజపాకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారంలో ఉన్న సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాల వివాదం దీనికి కారణమైంది. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమకే చెందినవంటూ ఇరు ప్రాంతాల నేతలు ప్రకటనలు చేయడం, కోర్టు కేసుపై దృష్టి సారించడం తాజా వివాదానికి తెరలేపింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పేర్కొన్న కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై.. రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఇలా పార్టీని పక్కనబెట్టి స్థానిక మనోభావాలే ప్రాధాన్యంగా ఇద్దరు భాజపా కీలక నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుండడంపై దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

మహారాష్ట్ర ఏమంటోంది..?

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని జాట్‌ తహసీల్‌కు చెందిన గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయంటూ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఇటీవల పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టత ఇవ్వాలంటూ మరాఠా విపక్ష నేత అజిత్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఫడణవీస్‌.. ‘జాట్‌ తీర్మానం 2012లో జరిగింది. అది పాత ప్రతిపాదన. మహారాష్ట్రలోని ఏ గ్రామం కూడా కర్ణాటకలో విలీనం కావాలనుకోవడం లేదు. సరిహద్దులోని ఏ ప్రాంతం కూడా ఎక్కడికి పోయే ప్రశ్నే లేదు’ అని పేర్కొన్నారు. ఇక బెల్గాం (బెళగావి), కార్వార్‌, నిపాని వంటి మరాఠి మాట్లాడే ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి చెప్పిన ఆయన.. వాటిని తమ రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం బలంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఫడణవీస్‌వి రెచ్చగొట్టే వ్యాఖ్యలే..! బొమ్మై

‘ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై దేవేంద్ర ఫడణవీస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవు. తమ భూమి, నీరు, సరిహద్దులను రక్షించుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కర్ణాటకలోని సరిహద్దు జిల్లాల్లోని ప్రాంతాలను వదులుకునే ప్రసక్తే లేదు. మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలైన సోలాపుర్‌, అక్కల్‌కోట్‌లు కర్ణాటకలో చేర్చాలి.  సరిహద్దు అంశాన్ని మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. దీనిపై మహా ప్రభుత్వం 2004 నుంచి సుప్రీం కోర్టులో పోరాడుతోంది. ఇప్పటికీ విజయం సాధించలేదు. అది జరగదు కూడా. న్యాయపరంగా తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఘాటుగా స్పందించారు. గతంలో నీటి సంక్షోభం వచ్చినప్పుడు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం కావాలని తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వారి విలీన డిమాండును తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని.. వారికి సహాయం చేసేందుకు ఇదివరకు ప్రత్యేక పథకాలను అమలు చేసిందన్నారు.

ఏమిటీ వివాదం..?

మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం కొత్తదేమీ కాదు. గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1956లో ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కన్నడ మాట్లాడే గ్రామాలు తమవేనంటూ ఇటు కర్ణాటక చెబుతోంది. అప్పట్లో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన (Mahajan Commission) కమిటీ 1960ల్లోనే ఓ నివేదిక అందించింది. కానీ, మహారాష్ట్ర మాత్రం ఆ నివేదికను తోసిపుచ్చింది. ఇలా ఇరువర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో ఆ నివేదక సిఫార్సులు పూర్తిగా అమలు కాలేదు. చివరకు దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం 2004లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగులోనే ఉండిపోయింది. ఇటీవల ఇదే అంశంపై మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. బెల్గాంను మహారాష్ట్రలో కలపాలనే డిమాండుకు బాలాసాహెబ్‌ ఠాక్రే ఎప్పుడూ మద్దతిచ్చేవారని అన్నారు. తాజాగా దీనిపై న్యాయస్థానంలో పోరాడేందుకు గాను న్యాయబృందంతో సమన్వయం కోసం ఇద్దరు మంత్రులను మహారాష్ట్ర ఇటీవల నియమించింది. అటు కర్ణాటక కూడా న్యాయ నిపుణులను రంగంలోకి దింపడంతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు