‘మంత్రుల్ని కాపాడేందుకే పవార్‌ ప్రయత్నాలు’

మహారాష్ట్రలో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన భాజపా

Published : 25 Mar 2021 01:06 IST

ముంబయి: మహారాష్ట్రలో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన భాజపా నేతలతో కలిసి గవర్నర్‌ భగత్‌ సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో కరోనా, హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు సహా పలు అంశాలపై సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నుంచి నివేదిక కోరాలని వారు గవర్నర్‌కు వినతి పత్రం అందించారు.

‘రాష్ట్రంలో ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయింది. కేవలం అధికారం కోసమే వారు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంచలనం సృష్టించే సంఘటనలు జరుగుతున్నా సీఎం మౌనం వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పరిణామాలపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సైతం రెండు పర్యాయాలు మీడియా సమావేశం నిర్వహించారు. కానీ, ఆయన ఎంతసేపు తమ మంత్రులను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను సమర్పించిన పోలీసు బదిలీల కుంభకోణానికి సంబంధించిన అధికారిక సాక్ష్యాల విషయంలో నాపై కేసులు వేసినా భయపడేది లేదు. కోర్టుకు వెళ్లి అయినా నాకు నేను నిరూపించుకుంటా. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పరిస్థితుల గురించి ప్రభుత్వానికి కొంచెం కూడా బెంగ లేదు. ఇది ఉపన్యాసాలు ఇవ్వడానికి తగిన సమయం కాదు.. చర్యలు తీసుకోవాల్సిన సమయం’ అని ఫడణవీస్‌ విమర్శలు చేశారు. 

మహారాష్ట్రలో ఇటీవల ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందిస్తూ.. పోలీసు అధికారుల బదిలీల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తన వద్ద కాల్‌ డేటా, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని సైతం తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని