AAP - Rahul: ఆ విషయం ప్రజలు చూసుకుంటారు: కేజ్రీవాల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి(Rahul Gandhi) దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal) మద్దతుగా నిలిచారు. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

Published : 24 Mar 2023 00:14 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal) మద్దతుగా నిలిచారు. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. విచారణల పేరుతో ప్రతిపక్ష నాయకులపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘‘భాజపాయేతర నాయకులు, పార్టీలపై కుట్ర జరుగుతోంది. మాకు కాంగ్రెస్‌తో విభేదాలున్నాయి. కానీ రాహుల్‌ని ఇలా పరువునష్టం కేసులో ఇరికించడం సరైంది కాదు. ఆ విషయం ప్రజలు చూసుకుంటారు. అవసరమైతే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. మేం కోర్టును గౌరవిస్తాం కానీ ఈ తీర్పుతో ఏకీభవించం’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని అణచివేయడం తగదని ఆప్‌ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్ధా అన్నారు.

కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) ఇదివరకూ ఎన్నడూ ఒకరికి ఒకరు మద్దతిచ్చుకోలేదు. మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసినప్పుడు ఆప్‌కు కాంగ్రెస్‌ మద్దతుగా నిలవలేదు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటములను ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాహుల్‌కు ఆప్‌ మద్దతుగా నిలవడం గమనార్హం. రాజకీయ పరిణామాలపై చర్చించటానికి 8 మంది భాజపాయేతర ముఖ్యమంత్రులను, కాంగ్రెస్‌ అధికారంలో లేని రాష్ట్రాలను ఇటీవల కేజ్రీవాల్‌ విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. పైకోర్టులో అప్పీలుచేయడానికి అవకాశమిస్తూ 30 రోజుల జైలు శిక్షను నిలుపుదల చేసింది. తీర్పుపై రాహుల్‌ పైకోర్టుకు అప్పీలు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని