Arvind Kejriwal: కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా మోదీకి మద్దతుగా నినాదాలు.. !

దిల్లీ (Delhi)లో ఓ యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రసంగిస్తుండగా.. సభలో ఉన్న కొందరు వ్యక్తులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీవాల్‌ కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశారు. 

Updated : 08 Jun 2023 17:52 IST

దిల్లీ: గత కొద్ది నెలలుగా దిల్లీ (Delhi)లోని ఆప్‌ ( AAP) ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో ఓ యూనివర్శిటీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు నిరసన సెగ తగిలింది. సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి, తాను చెప్పేది ఓపికతో వినాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు దిల్లీ ప్రాంతంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి సీఎం కేజ్రీవాల్ వెళ్లారు. ఇదే కార్యక్రమానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా కూడా వచ్చారు. 

ఇరువురు కలిసి యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేజ్రీవాల్‌ ప్రసంగిస్తుండగా.. సభలో ఉన్న కొందరు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీవాల్ కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపేశారు. అనంతరం కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ఇటువంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అనుకుంటే.. అది 70 ఏళ్ల క్రితమే జరిగేది. మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నేను చెప్పే మాటల్ని ఓ ఐదు నిమిషాలు ఓపికతో వినండి. ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే.. మీ నినాదాలను కొనసాగించండి. నా ఆలోచనలు, విధానాలు మీకు నచ్చకపోవచ్చు. దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. కానీ, అందుకు ఇది సరైన వేదిక కాదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 

గత కొంతకాలంగా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతోంది. గత నెలలో ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆ వెంటనే తీర్పుపై సమీక్ష కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌కు మద్దతు తెలపాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ కొద్ది రోజులుగా భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విపక్ష పార్టీల అధ్యక్షులతో వరుస భేటీలు నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని