భాజపా నేతలు దూషించినా కేజ్రీవాల్‌ వెనక్కి తగ్గరు!

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజల కోసం పనిచేస్తున్నా, భాజపా నేతలు ఆయనపై విమర్శలు, దూషణలకు దిగుతున్నారని డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అన్నారు. వారు ఎంతగా దూషించినా కేజ్రీవాల్‌ వెనకడుగు వేయరని, వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.

Published : 01 Jun 2021 01:37 IST

దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజల కోసం పనిచేస్తున్నా, భాజపా నేతలు ఆయనపై విమర్శలు, దూషణలకు దిగుతున్నారని డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అన్నారు. వారు ఎంతగా దూషించినా కేజ్రీవాల్‌ వెనకడుగు వేయరని, వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన వర్చువల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దిల్లీకి మరిన్ని టీకాలు కావాలని డిమాండ్‌ చేసినప్పటి నుంచి హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేజ్రీవాల్‌పై మాటల దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్‌ మేనేజ్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారన్నారు. వాళ్లు ఎంతగా దూషించినా.. దిల్లీ ప్రజలకు వ్యాక్సిన్ల కోసం కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉంటారన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్లు సేకరించాల్సిన సమయంలో భాజపా పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌లో తీరికలేకుండా ఉందని సిసోడియా దుయ్యబట్టారు. 

వ్యాక్సిన్‌తోనే కొవిడ్‌ నుంచి రక్షణ‌: కేజ్రీవాల్‌
దేశ రాజధాని నగరానికి జూన్‌లో  స్పుత్నిక్‌-వి టీకాలు అందే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. సోమవారం సిటీ స్కూల్‌ వద్ద పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీకా వేసుకోవడం ద్వారానే కొవిడ్‌ వైరస్‌ నుంచి రక్షణ పొందగలమన్నారు. జూన్‌ 20 తర్వాత దిగుమతి కానున్న వ్యాక్సిన్లలో కొంతభాగం దిల్లీకి అందే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆగస్టులో భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సీఎం చెప్పారు. దిల్లీ నగరంలో ప్రస్తుతం 944 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయన్నారు. దీని చికిత్సకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందన్న కేజ్రీవాల్‌.. శనివారం 1000 ఇంజెక్షన్లు రాగా, ఆదివారం ఏమీ రాలేదని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని