Updated : 26 Jan 2022 05:08 IST

arvind kejriwal: ఆఫీసుల్లో ఆ ఇద్దరి ఫొటోలుచాలు.. సీఎంలు సహా ఇంకెవరివీ పెట్టొద్దు!

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింట్లోనూ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, భగత్‌సింగ్‌ ఫొటోలు తప్ప మరే ఇతర రాజకీయ నేతల చిత్రపటాలు ఉండరాదని సీఎం కేజ్రీవాల్‌ ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రుల ఫొటోలూ అవసరంలేదన్నారు. దళిత కుటుంబంలో పుట్టి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఉన్న అంబేడ్కర్‌ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే, భగత్ సింగ్ విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. వారంతా ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం వేర్వేరు మార్గాల్లో పనిచేశారని వివరించారు. ‘ఇకపై దిల్లీలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ ఫొటోలే ఉండాలి. ముఖ్యమంత్రులు సహా మరే ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు ఉంచొద్దు’ అని అధికారులకు సూచించారు. ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల సిద్ధాంతాలపైనే దిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 

అ విషయం నాకెప్పటికీ ఆశ్చర్యమే!

దాదాపు వందేళ్ల క్రితం ఇంటర్నెట్‌ సదుపాయం కూడా లేని కాలంలో అంబేడ్కర్‌ ఎలా కొలంబియా యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారో, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌కు అప్పుడు ఎలా వెళ్లారో తనను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుందని తెలిపారు. భారత రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించారనీ.. దేశానికి తొలి న్యాయమంత్రిగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ప్రతి విద్యార్థికీ మంచి విద్య అందాలనేది అంబేడ్కర్‌ కలలు గన్నారన్నారు. కానీ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇది సాకారం కాలేదని కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రిపబ్లిక్‌డే వేడుకలను పురస్కరించుకొని ఆయన కలను సాకారం చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. 

అప్పుడే దేశం నంబర్‌ 1 అవుతుంది!

మరోవైపు, మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరికీ మంచి విద్య అందినప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్తుంది తప్ప పెద్ద పెద్ద ఎన్నికల హామీలతో కాదన్నారు. ‘‘ప్రతి విద్యార్థికీ మంచి విద్య అందినప్పుడే దేశం నంబర్‌ వన్‌గా మారుతుంది. దీనికి దగ్గరదారి ఏమీ లేదు. ఎన్నికల్లో ఎంత పెద్ద హామీ ఇచ్చామన్నది ముఖ్యం కాదు. మనం కష్టపడాలి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే దిశగా కీలక చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో తమ ప్రభుత్వ హయంలో విద్యా రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. 2015లో తమ ప్రభుత్వం 25శాతం బడ్జెట్‌ను విద్య, పాఠశాలల్లో మౌలికవసతులను మెరుగుపరిచేందుకే కేటాయించిందన్నారు. ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఐఐఎంలకు, విదేశాలకు పంపినట్టు చెప్పారు. దాని ఫలితాలు కనబడుతున్నాయనీ.. ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థుల్లో 99.6శాతం ఉత్తీర్ణత సాధించామని వెల్లడించారు. విద్యా రంగంలో మరో కీలక అడుగు వేసే దిశగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దేందుకు హ్యాపీ కరికులమ్‌; వారిలో వ్యాపార చతురతను పెంపొందించేందుకు 9వ తరగతి నుంచి వ్యవస్థాపక తరగతులు; దేశభక్తిని పెంపొందించేందుకు దేశభక్తి తరగతులు బోధించనున్నట్టు కేజ్రీవాల్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని