వారు బిర్యానీ తినటం వల్ల దేశమంతా బర్డ్‌ఫ్లూ..

దిల్లీ రైతుల ఆందోళన, దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ పెరిగేందుకు దోహదం చేస్తుందని ఓ భాజపా నేత అంటున్న వీడియో

Published : 11 Jan 2021 08:11 IST

దిల్లీ: దేశంలో రాజస్థాన్‌తో సహా ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి ఉన్నట్టు కేంద్రం నిర్ధారించింది. దీనిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన, దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ సమస్య పెరిగేందుకు దోహదం చేస్తుందని ఓ భాజపా నేత అంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిరసనకారులు చికెన్‌ బిర్యానీ తింటున్నారని, తద్వారా ఆ వ్యాధి వ్యాప్తి మరింత అధికం కావచ్చని.. రాజస్థాన్‌లోని రామ్‌గంజ్‌ మండీ నియోజక వర్గ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ అంటున్నట్టుగా ఈ వీడియోలో ఉంది.

‘‘వారు హాయిగా బిర్యానీని ఆస్వాదిస్తున్నారు. జీడిపప్పు, బాదం పప్పు తింటున్నారు. అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నారు. తమ అవతారాన్ని తరచు మారుస్తున్నారు. వారిలో చాలామంది ఉగ్రవాదులు ఉండవచ్చు. దొంగలు, దోపిడీదారులు కూడా ఉండవచ్చు. వారు రైతులకు శత్రువుల వంటి వారు. వారిని సామరస్యంగా లేదా.. బలప్రయోగం ద్వారా అయినా ప్రభుత్వం త్వరలో అక్కడ నుంచి తొలగించకపోతే.. దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ సమస్య తలెత్తుతుంది’’ అని ఎమ్మెల్యే దిలావర్‌ అంటున్నట్టుగా ఈ వీడియోలో చూడవచ్చు.

రాజస్థాన్‌ పాఠశాల విద్య, పర్యాటక, దేవాదాయశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ దొతాస్రా కూడా ఈ వీడియోను గురించి తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రస్తావించారు. రైతులను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం సిగ్గుపడాల్సిన విషయమని ఆయన విమర్శించారు. మనకు అన్నం పెట్టే వారిని పిక్నిక్‌కు వచ్చారని, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చేస్తున్నారనటాన్ని ఆయన తప్పు పట్టారు. భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ ప్రకటన.. ఆ పార్టీ ఆలోచనా విధానాన్నే ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి.. 

ఏడుకు చేరిన బర్డ్‌ ఫ్లూ రాష్ట్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని