Manipur Polls: సగానికి పైగా మహిళా ఓటర్లే.. పోటీలో మాత్రం 17 మందే..!

అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణిస్తున్నారు. తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని చోట్ల అసమానతలు మాత్రం తొలగట్లేదు. ముఖ్యంగా

Published : 22 Feb 2022 01:30 IST

ఇంఫాల్‌: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణిస్తున్నారు. తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని చోట్ల అసమానతలు మాత్రం తొలగట్లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ అంతరం మరీ ఎక్కువగా ఉంది. జనాభా, ఓటర్ల పరంగా సరిసమానంగా ఉంటున్నా.. ప్రజా ప్రాతినిధ్యంలో మాత్రం మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల జరగబోయే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అయితే మహిళా నేతలు అత్యల్ప సంఖ్యలో ఉండటం గమనార్హం. 

60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మణిపూర్‌లో త్వరలో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పురుష ఓటర్లు 9.90లక్షలు అయితే.. మహిళా ఓటర్ల సంఖ్య 10.57లక్షలుగా ఉంది. అంటే సగానికి పైగా మహిళా ఓటర్లే. కానీ పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో మాత్రం కనీసం 20 మంది కూడా లేరు. రెండు దశల్లో కలిపి మొత్తం 265 మంది పోటీ చేస్తుండగా.. ఇందులో 17 మంది మహిళలు ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే.. భాజపా, కాంగ్రెస్‌ల నుంచి ముగ్గురు చొప్పున పోటీ చేస్తుండగా.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇద్దరు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నుంచి ఇద్దరు, జనతాదళ్‌ (యునైటెడ్‌) నుంచి ఒక మహిళా అభ్యర్థి బరిలో ఉన్నారు. 

మణిపుర్‌లో అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ.. రాజకీయాల్లో మాత్రం మహిళా సాధికారిత లేదని వారు వాపోతున్నారు. సమాజం నుంచి సరైన మద్దతు లేకపోవడం వల్లే ఇక్కడ రాజకీయ నాయకురాళ్ల సంఖ్య అల్పంగా ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు శారదా దేవి తెలిపారు. ‘‘రాజకీయాల్లో వచ్చే మహిళలను ఈ సమాజం భిన్నంగా చూస్తుంది. వారిని ఎప్పటికప్పుడు కిందకు లాగేయ్యాలని ప్రయత్నిస్తుంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఏకే మీరాబాయి దేవీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. రాజకీయాల్లో, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించనంతవరకు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుందని ఆమె అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని