Ap News: 175 సీట్లు గెలుస్తామంటున్న జగన్‌.. ఏ ముఖంతో ప్రజల్లోకి వెళ్తారు?: దేవినేని

వైకాపా ప్రభుత్వం ప్రజా ధనాన్ని సొమ్ము చేసుకుంటూ రాష్ట్రానికి అప్పులు మిగుల్చుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం గుండ్లకమ్మ జలాశయాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి దేవినేని పరిశీలించారు.

Published : 01 Mar 2023 16:51 IST

మద్దిపాడు: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ గేటు మరమ్మతులు చేయడంలో అధికార పార్టీ విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం మద్దిపాడు మండలం గుండ్లకమ్మ జలాశయాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి దేవినేని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలాశయం గేటు విరిగిపోయి 8నెలలు గడుస్తోందన్నారు. నెల రోజుల్లో మరమ్మతులు చేయిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇస్తున్నారు గానీ.. రాష్ట్రానికి అప్పులే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి నా.. ఇప్పటికీ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రజా ధనాన్ని సొమ్ము చేసుకుంటూ రాష్ట్రానికి అప్పులు మిగుల్చుతున్నారు. గేట్ల మరమ్మతులు చేయడానికి వచ్చిన గుత్తేదారులకు నిధులు రాకపోవడంతో వదిలేసి పోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఏ ముఖం పెట్టుకుని  ప్రజల్లోకి వెళ్తారు? ఇప్పటివరకు గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల చేయలేదు. ఖరీఫ్‌లో గుండ్లకమ్మ నుంచి రైతులకు నీరందించేందుకు ఎలాంటి మాయమాటలు చెబుతారో వేచి చూడాలి. సీఎం జగన్‌ చెబుతున్న మాటలు ప్రజలు  గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి తప్పదు’’ అని దేవినేని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని