Dharmapuri Srinivas: అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆయన సోదరుడు ధర్మపురి సంజయ్‌ మండిపడ్డారు. బ్లాక్‌ మెయిల్‌ చేసి లేఖలు రాయిస్తున్నారని విమర్శించారు.

Updated : 27 Mar 2023 20:52 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) (Dharmapuri Srinivas) రాజీనామా వివాదంపై ఆయన తనయుడు సంజయ్‌ (Dharmapuri Sanjay) స్పందించారు. రాజీనామా లేఖలు..ఎంపీ అర్వింద్‌ (Arvind) చేస్తున్న నీచ రాజకీయమని మండిపడ్డారు. ‘‘అర్వింద్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి లేఖలు రాయిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరడం డీఎస్‌ కోరిక. నిన్న సంతోషంగానే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీఎస్‌ లేఖ రాస్తే ఎందుకు వీడియో రికార్డు చేయించారు? ఆయనకు ఫిట్స్‌ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారు? మా నాన్న ఆరోగ్యంపై ఆరోగ్యంపై ఆందోళన ఉంది. ఎంపీ అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారు’’ అని ధర్మపురి సంజయ్‌ మండిపడ్డారు.

డీఎస్‌ ఆరోగ్యంపై బులిటెన్‌

మరోవైపు డీఎస్‌ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది. పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న డీఎస్‌కు డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ సర్జరీ జరిగింది. ఈ మేరకు ఒత్తిడి, రద్దీకి, ప్రయాణాలకు, రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు.

నాకేం సంబంధం లేదు: అర్వింద్‌

డీఎస్‌ రాజీనామా వివాదంపై ఆయన కుమారుడు, భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వివరణ ఇచ్చారు. డీఎస్‌ రాజీనామా వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, రాజీనామా చేశారని ఓ ఎపిసోడ్‌ నడుస్తోంది. నా తండ్రి పక్కా కాంగ్రెస్‌ వాది.. నేను పక్కా భాజపా వాదిని. 2018 నుంచి కాంగ్రెస్‌లో చేరతానని ఆయన చెబుతున్నారు. కానీ, ఎందుకో చేర్చుకోలేదు. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ మాట్లాడినా గుర్తుండదు. నిన్న రాత్రి మళ్లీ ఫిట్స్‌ వచ్చింది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వైద్యుల సలహా మేరకు ఎప్పుడు అనారోగ్యానికి గురైనా మేం వీడియో తీస్తాం. ఈ పరిస్థితుల్లో తన తండ్రిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించుకోవడం సరికాదు. నా రాజకీయానికి, నా తండ్రి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని అర్వింద్‌ తెలిపారు.

డీఎస్‌కు రక్షణ కల్పించండి: నిరంజన్‌

మాజీ ఎంపీ డీఎస్‌కు రక్షణ కల్పించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్‌ డీజీపీ అంజన్‌కుమార్‌ని కోరారు. డీఎస్‌కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, అందుకే ఆయనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ డీఎస్‌ తనయుడు సంజయ్‌ మాట్లాడిన వీడియో మీడియాలో హల్‌ చేస్తోంది. దీనిని బట్టి డీఎస్‌ను వేధిస్తున్నారని తెలుస్తోంది. వేధింపుల గురించి డీఎస్‌ స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఆయన మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని హెల్త్‌బులిటెన్‌లో సిటీ న్యూరో ఆస్పత్రి పేర్కొంది. వీటన్నింటినీ చూసిన తర్వాతే..ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని కోరుతున్నాం.’’ అని నిరంజన్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు