Hyderabad: మా ఇంటిపై 50మంది తెరాస కార్యకర్తలు దాడి చేశారు: ధర్మపురి విజయలక్ష్మి

నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై అర్వింద్‌ తల్లి డి.విజయలక్ష్మి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 18 Nov 2022 22:04 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై అర్వింద్‌ తల్లి డి.విజయలక్ష్మి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున పర్సనల్‌ అడ్వొకేట్లు, మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ‘‘ఉదయం 11.30 గంటలకు 50 మంది తెరాస కార్యకర్తలు మా ఇంటిపై దాడి చేశారు. గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తెరాస జెండా కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంట్లో పనిచేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డు రమణ గాయపడ్డారు. బెంజ్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన 50 మంది తెరాస కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి’’ అని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్‌ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

8మందిపై కేసు నమోదు

మరో వైపు ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి చేసిన వారిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 8మంది నిందితులను గుర్తించిన పోలీసులు రెడ్ విత్ సెక్షన్ 149, 148, 452, 323 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని