దీదీ.. మరో సీటు నుంచి పోటీ చేస్తున్నారా?

యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. గురువారం రెండో దశ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్‌ సహా 30 నియోజకవర్గాల్లో ఓటింగ్‌

Published : 01 Apr 2021 18:14 IST

మమతపై ప్రధాని విమర్శలు.. ఖండించిన టీఎంసీ

కోల్‌కతా: యావత్‌ దేశ దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. గురువారం రెండో దశ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్‌ సహా 30 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించగా కొన్ని చోట్ల ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు బెంగాల్‌ పర్యటనలో ఉన్న మోదీ నేడు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. నందిగ్రామ్‌లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. 

‘‘మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే నందిగ్రామ్‌ వదిలి వెళ్లట్లేదు. ఈసారి ఆమె తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌ను వదిలి నందిగ్రామ్‌కు మారారు. కానీ ప్రజలు తమ సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆమెకు తన తప్పు తెలిసొచ్చినట్లుంది. దీదీ.. మీరు మరో నియోజకవర్గం నుంచి నామినేషన్‌ వేయనున్నట్లు వస్తున్న వార్తలో నిజం ఉందా?’’ అని  ఉలుబెరియా ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శించారు. 

కొట్టిపారేసిన టీఎంసీ..

అయితే మోదీ వ్యాఖ్యలను తృణమూల్‌ కాంగ్రెస్ వర్గాలు ఖండించారు. దీదీ మరో స్థానంలో పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ‘‘సీఎం రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నే తలెత్తకూడదు. నందిగ్రామ్‌లో ఆమె సునాయాసంగా విజయం సాధిస్తారు’’ అని టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని