‘సువేందు వచ్చారు.. కానీ నేను కలవలేదు’

భారత సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను భాజపా నేత సువేందు అధికారి కలిశారని, ఆయనను వెంటనే ఎస్‌జీ పదవి నుంచి తొలగించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది

Published : 03 Jul 2021 01:14 IST

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా

దిల్లీ: భారత సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను భాజపా నేత సువేందు అధికారి కలిశారని, ఆయనను వెంటనే ఎస్‌జీ పదవి నుంచి తొలగించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తుషార్‌ మెహతా స్పందించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సువేందు తన ఇంటికి వచ్చారని తెలిపారు. అయితే తాను మాత్రం ఆయనను కలవలేదని వెల్లడించారు. 

సువేందు అధికారిపై నమోదైన కొన్ని క్రిమినల్‌ కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుల్లో కొన్నింటికి సీబీఐ తరఫున తుషార్‌ మెహతా న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత ప్రయోజనాల కోసమే సువేందు.. తుషార్‌ను కలిశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపిస్తున్నారు. మెహతాను తక్షణమే సొలిసిటర్‌ జనరల్‌ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘‘తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల్లో తీర్పును ప్రభావితం చేయాలనే లక్ష్యంతోనే సువేందు.. తుషార్‌ను కలిశారు. సొలిసిటర్‌ జనరల్‌ చర్యలు అక్రమాలకు దారితీసేలా ఉన్నాయి. ఆ పదవి సమగ్రతను ప్రశ్నించేలా, ఆ పదవికి కళంకం తెచ్చేలా ఉన్నాయి. అందువల్ల వెంటనే ఆయనను ఎస్‌జీగా తొలగించాలి’’ అని టీఎంసీ ఎంపీలు లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు. 

అయితే ఈ ఆరోపణలపై తుషార్‌ మెహతా తాజాగా స్పందించారు. ‘‘నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సువేందు అధికారి మా ఇల్లు/ఆఫీసుకు వచ్చారు. అయితే అప్పటికే నేను నా ఛాంబర్‌లో ప్రీషెడ్యూల్‌ మీటింగ్‌లో ఉన్నా. మా సిబ్బంది ఆయనను వెయిటింగ్‌ రూంలో కూర్చోమని చెప్పారు. సమావేశం పూర్తయిన తర్వాత సువేందు వచ్చిన విషయం మా స్టాఫ్‌ నాకు చెప్పారు. అయితే నేను ఆయనను కలవలేనని, ఈ విషయం సువేందుకు చెప్పమని నా సిబ్బందికి సూచించాను. దీంతో ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెళ్లిపోయారు. జరిగింది ఇది.. అందువల్ల మేం సమావేశమయ్యామనే ప్రశ్నే తలెత్తకూడదు’’ అని మెహతా వివరించారు.

ఇదిలా ఉండగా.. ఈ పరిణామాలపై సువేందు కూడా స్పందించారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల గురించి చర్చించేందుకు తాను మెహతా నివాసానికి వెళ్లానని, అయితే ఆయనను కలవలేకపోయానని అధికారి తెలిపారు. 

బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తున్న నారదా కుంభకోణం కేసులో సువేందు పేరు కూడా ఉంది. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతుండగా.. దర్యాప్తు సంస్థ తరఫున మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇదేగాక, శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులోనూ సువేందుపై ఆరోపణలు రాగా.. ఈ కేసులోనూ సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని