Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా

సత్తెనపల్లి టికెట్‌ విషయంలో యుద్ధానికైనా సిద్ధమని వైకాపా నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ చిట్టా విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Published : 02 Apr 2023 16:48 IST

సత్తెనపల్లి: వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, మద్దతు ఇవ్వాలని వైకాపా నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ చిట్టా విజయ్‌భాస్కర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ ఆత్మీయ సమ్మేళనం పేరిట చిట్టా విజయ్‌భాస్కర్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సత్తెనపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక నాయకత్వం వ్యవహార శైలితో పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, చిన్న పనిపై వెళ్లినా కోటరీలో నాయకులను కలవాలని స్థానిక నాయకత్వం చెబుతుండటం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.

రోజూ మైకుల ముందు మాట్లాడటం, జగన్‌ను పొగడటం వల్ల పార్టీ బలపడదని.. ప్రజలు, కార్యకర్తల కష్టాన్ని పట్టించుకోవాలన్నారు. సత్తెనపల్లి అనాథ బిడ్డలా మారిందని, నాలుగేళ్లు చంకనెక్కించుకోవడం, ఐదో ఏడాది పడేసి పోవడం జరుగుతోందన్నారు. స్థానిక నాయకత్వాన్ని బలపర్చేవిధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తాను నిర్మించిన పునాదులు బలహీనమవుతుంటే చూస్తూ ఊరుకోమని తానెంత వరకైనా పోరాడతానని చిట్టా చెప్పారు. 34ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో ప్రాణాలు అడ్డు పెట్టైనా సీటు సాధిస్తానని పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన కోరారు. నెల రోజుల్లో కార్యాచరణ ప్రారంభించి జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ  వెళ్లి  జోలెపట్టి మద్దతు అడుగుతానని, అప్పటికైనా హైకమాండ్‌ తనను పట్టించుకుంటుందేమోన్నారు. సత్తెనపల్లి టికెట్‌ విషయంలో యుద్ధానికైనా సిద్ధమని తెలిపారు. సమావేశానికి రాకుండా చాలామందిని బెదిరించారన్నారు. ఆత్మీయ సమ్మేళానానికి హాజరైన వారిని ఇబ్బంది పెట్టేలా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తే రోడ్డెక్కుతానని చిట్టా హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని