
Priyanka Gandhi: విమానం ఎక్కేలా చేస్తామన్నారు.. కనీసం రోడ్డుపైనా తిరగనివ్వట్లేదుగా..!
దిల్లీ: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు విమానంలో ప్రయాణించేలా చేస్తామని చెప్పిన ఎన్డీయే సర్కారు.. ఇప్పుడు వారిని కనీసం రోడ్డుపైనా తిరగనివ్వట్లేదని ఎద్దేవా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్ ధర కంటే విమాన ఇంధన ధరలే తక్కువగా ఉన్నాయంటూ తాజాగా వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రియాంక గాంధీ.. ‘‘హవాయి చెప్పులు(మధ్య తరగతి ప్రజలను ఉద్దేశిస్తూ) వేసుకునే వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. కానీ భాజపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోంది. దీంతో హవాయి చెప్పులు వేసుకునే వారు, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు రోడ్డుపై ప్రయాణించడమే కష్టంగా మారింది’’ అంటూ కేంద్రానికి చురకలంటించారు.
కేంద్రం పన్ను దోపిడీకి పాల్పడుతోంది: రాహుల్
మరోవైపు, రాహుల్ కూడా తనదైన శైలిలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం పన్ను దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. విమానయాన ఇంధనం కన్నా పెట్రోల్, డీజిల్ ధరలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలోనూ కేంద్రం విఫలమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. తన కొద్దిమంది స్నేహితుల కోసం ప్రధాని దేశంలోని పేదను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో గత కొన్ని రోజులుగా చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77కు చేరగా.. దిల్లీలో రూ.105.84కు ఎగబాకింది. అటు లీటర్ డీజిల్ ధర కూడా చాలా ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. ఇదిలా ఉండగా.. విమాన రాకపోకలకు వినియోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) లీటరు ధర కంటే.. లీటరు పెట్రోలు/డీజిల్ ధరే కనీసం రూ.20 కంటే అధికంగా ఉండటం గమనార్హం.