Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్రలో మంత్రిమండలి విస్తరణ వార్తలు వస్తోన్న వేళ.. ఏక్‌నాథ్‌ శిందే- దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంపై శివసేన నేత ఆదిత్యనాథ్‌ ఠాక్రే విరుచుకుపడ్డారు. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో అర్థం చేసుకోవడం...

Published : 09 Aug 2022 01:50 IST

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లో మంత్రిమండలి విస్తరణ వార్తలు వస్తోన్న వేళ.. ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)- దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis) ప్రభుత్వంపై శివసేన(Shivsena) నేత ఆదిత్య ఠాక్రే(Aaditya Thackeray) విరుచుకుపడ్డారు. అసలు ఈ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరో అర్థం చేసుకోవడం కష్టంగా మారిందన్నారు. సోమవారం మాతోశ్రీ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఠాక్రే ప్రసంగించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు(Supreme Court)లో శివసేన చేస్తున్న పోరాట ఫలితం.. పార్టీపైనే కాకుండా మొత్తం దేశంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తోన్నా. ఇద్దరే నేతలు ఉన్న జంబో క్యాబినెట్‌లో.. నిజమైన ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన మంత్రిమండలి విస్తరణకు మంగళవారం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నేత ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తికాగా.. తొలుత 15 మందిని మంత్రులుగా తీసుకోనున్నట్లు సమాచారం. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేయడంతో జూన్‌ 30న శిందే, ఫడణవీస్‌లు మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరితోనే మంత్రిమండలి కొనసాగుతోంది. కేవలం ఇద్దరు మంత్రులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుండటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని