Article 370: దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై దుమారం!

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం.....

Published : 12 Jun 2021 16:28 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపాయి. ఆర్టికల్‌ 370 రద్దు విచారకరమని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని పరిశీలిస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమయ్యాయి. దీనిపై అధికార భాజపా మండిపడింది. పాక్‌తో ఆ పార్టీ ఒప్పందం చేసుకుందని విమర్శించింది.

క్లబ్‌ హౌస్‌ అనే సోషల్‌మీడియా యాప్‌లో జరిగిన చర్చలో పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్‌ సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం విచారకరం. కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని పునః పరిశీలిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన ఆడియో క్లిప్‌ను భాజపా విడుదల చేస్తూ దిగ్విజయ్‌పై విమర్శలు గుప్పించింది.

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సమాధానం ఇవ్వాలని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు. పాక్‌తో ఒప్పందం కుదుర్చుకుని దిగ్విజయ్‌ భారత్‌పై విషం కక్కుతున్నారని విమర్శించారు. గతంలోనూ పుల్వామా దాడిని ప్రమాదంగా అభివర్ణించారని చెప్పారు. గతంలో రాహుల్‌ గాంధీ, మణిశంకర్‌ అయ్యర్‌ సైతం పాక్‌ భాషనే మాట్లాడారని గుర్తుచేశారు. పాక్‌తో చేతులు కలిపి కాంగ్రెస్‌ పార్టీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రులు గిరిరాజ్‌సింగ్‌, కిరణ్‌ రిజిజు సైతం దిగ్విజయ్‌పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో దిగ్విజయ్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘‘తప్పక చేస్తాం.. పరిగణిస్తాం అనే పదాలకు ఈ నిరక్ష్యరాస్యులకు అర్థం తెలీడం లేదు’’ అంటూ పరోక్షంగా భాజపానుద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని