Dilip Ghosh: ‘నా లైఫ్‌ ప్రమాదంలో ఉంది.. ఎన్నికను వాయిదా వేయాలి’

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపూర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు మద్దతుగా.....

Updated : 28 Sep 2021 01:43 IST

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళ్లిన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై టీఎంసీ నేతలు దాడి చేసినట్లు భాజపా ఆరోపించింది. గుంపును చెదరగొట్టేందుకు దిలీప్‌ ఘోష్‌ సిబ్బంది తుపాకులు బయటకు తీశారు. ఈ నేపథ్యంలోనే ఘోష్‌ స్పందించారు. భవానీపూర్‌ ఉప ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

దిలీప్‌ ఘోష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘మా అభ్యర్థి మద్దతుగా భవానీపూర్‌లో నేను కరపత్రాలు పంపిణీ చేస్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో నేను ఓ వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి వెళ్లాను. అక్కడకు చేరుకొని వాళ్లు నన్ను చుట్టుముట్టారు. అనంతరం దాడికి పాల్పడ్డారు. మా కార్యకర్తలను కొట్టారు. నా జీవితం ప్రమాదంలో ఉంది’ అని పేర్కొన్నారు. తనపై దాడి జరిగిన అనంతరమే తనను రక్షించేందుకు సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు బయటకు తీసినట్లు వెల్లడించారు. ఎంపీ అర్జున్‌సింగ్‌పై సైతం ఇదే తరహా దాడి జరిగినట్లు తెలిపారు.

‘ఎన్నికల సంఘం అక్కడ భద్రతా చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా వారు మాకు ఎలాంటి సహాయం చేయలేదు. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ పోలీసు మమ్మల్ని కాపాడేందుకు యత్నించగా ఆయనపైనా దాడి జరిగింది’ అని ఘోష్‌ వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు న్యాయపరంగా జరగవు. అందుకే ఉప ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని