Dimple Yadav: భాజపా ఓటర్లను కోనేస్తోంది: డింపుల్‌ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో భాజపా నేతలు ఓటర్లను కొనేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ యాదవ్‌ ఆరోపించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు.

Published : 05 Dec 2022 01:34 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో భాజపా నేతలు ఓటర్లను కొనేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్‌ యాదవ్‌ ఆరోపించారు. మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ఈమేరకు ఎన్నికల సంఘాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘ వందలాది మంది భాజపా నాయకులు, కార్యకర్తలంతా మెయిన్‌పురి స్టేషన్‌రోడ్డులోని పామ్‌ హోటల్‌కి చేరారు. అక్కడి నుంచే మద్యం, డబ్బును పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి.’’ అంటూ డింపుల్‌ యాదవ్‌ హిందీలో ట్వీట్‌ చేశారు.

తానే స్వయంగా వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు భాజపా చర్యలకు వ్యతిరేకంగా పోలింగ్‌ ప్రారంభానికి ముందే సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలంతా ధర్నాకు దిగే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతితో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభస్థానానికి సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పాటు రామ్‌పూర్‌ సదర్‌, ఖతౌలి అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని