భాజపావి ‘బుల్డోజర్‌’ పాలిటిక్స్‌.. అక్కడ భాజపా-ఆప్‌ మధ్యే ప్రత్యక్ష పోటీ: జైన్‌

ఇప్పుడు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తూ భాజపాకు మళ్లీ ఓటు వేసి గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. కానీ వారి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ప్రజల్ని ఆయన ఓట్లు అడగాలి

Published : 05 May 2022 01:52 IST

దిల్లీ: ఈ ఏడాది చివర్లో జరగబోయే హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు, అధికార భాజపాకు మధ్యే ప్రత్యక్ష పోరు ఉంటుందని ఆప్‌ సీనియర్‌ నేత,  దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. ఆ ఎన్నికల్లోనూ తమ పార్టీయే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (హిమాచల్‌ప్రదేశ్‌) చీఫ్‌ అనేందర్‌ సింగ్‌ నౌటి, మరో 30మందితో కలిసి ఆప్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో హిమాచల్‌ప్రదేశ్ సీఎం ఇప్పుడు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తూ భాజపాకు మళ్లీ ఓటు వేసి గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. కానీ వారి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ప్రజల్ని ఆయన ఓట్లు అడగాలి’’ అన్నారు.

‘‘హిమాచల్‌ ఎన్నికల్లో ఆప్‌, భాజపా మధ్యే ప్రత్యక్ష పోరు ఉండబోతోంది. కాంగ్రెస్‌ ఎక్కడా పోటీ కాదు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఆప్‌లో చేరినవారిలో కూడా కొందరు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. నేను పాంటా సాహిబ్‌లో పర్యటించినప్పుడు దాదాపు 1000 మంది ఆప్‌లో చేరబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేస్తాం. ఈరోజు ఆప్‌లో చేరిన 31 మందిలో ఇద్దరు మాజీ మహిళా మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ఉన్నారు’’ అని వివరించారు.

మరోవైపు, దిల్లీలోని సరోజినీ నగర్‌ ప్రాంతంలో నాలుగు ఆలయాలు కూల్చివేసేందుకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటీసులు పంపిందంటూ ఆప్‌ నేత అతిషి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా.. భాజపా బుల్డోజర్‌ రాజకీయాలు చేస్తోందని జైన్‌ మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తించేందుకు కూల్చివేత చర్యలతో వారిని బెదిరిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని