Congress: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఊరట.. అలకమానిన ఆరుగురు ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కినుక వహించిన అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం....

Published : 05 Jun 2022 14:30 IST

జైపుర్‌: రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కినుక వహించిన అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. శనివారం రాత్రి సీఎం అశోక్‌ గహ్లోత్‌తో సమావేశమైన తర్వాత వారంతా ఉదయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికి రావడానికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు సీఎంతో కలిసి వారు ఉదయ్‌పుర్‌ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించిన తర్వాతే వాళ్లంతా అలకమానినట్లు సమాచారం.

రాజ్యసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ ఉదయ్‌పుర్‌లోని ఓ రిసార్టుకి తరలించింది. అయితే, ఓ మంత్రి సహా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం జైపుర్‌లోనే ఉండిపోయారు. తమ డిమాండ్లను నెరివేరిస్తేనే రిసార్టుకు వస్తామని వారు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. శనివారమే ఉదయ్‌పుర్‌లోని శిబిరాన్ని సందర్శించాల్సిన గహ్లోత్‌ ఆగిపోయారు. వారితో చర్చలు జరిపి బుజ్జగించడానికే ఆయన ఉండిపోయారని సమాచారం.

కాంగ్రెస్‌కు మొత్తం 109 మంది శాసనసభ్యుల బలం ఉంది. వీరిలో ఆరుగురు బీఎస్పీ సభ్యులు. వీరంతా కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. బీఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు తాజాగా కినుక వహించారు. అయితే, వీరంతా కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతు ఇస్తారని.. కానీ, పార్టీపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు సమాచారం. రాజస్థాన్‌ నుంచి ముకుల్‌ వాస్నిక్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, ప్రమోద్‌ తివారీలను రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎంపిక చేసింది. మరోవైపు భాజపా తమ మాజీ మంత్రి ఘనశ్యామ్‌ తివారీని ఎంపిక చేసింది. అలాగే స్వతంత్ర అభ్యర్థి మీడియా దిగ్గజం సుభాష్‌ చంద్రకు మద్దతు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని