Updated : 27/09/2020 05:34 IST

తెలంగాణలో భాజపా జెండా పాతుతాం

ఈటీవీ ముఖాముఖీలో డీకే అరుణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపిక కావడంపై డీకే అరుణ సంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఏ పదవినీ ఆశించలేదని తెలిపారు. కేంద్ర కార్యవర్గంలో స్థానాన్ని సిన్సియారిటీ, చరిష్మాకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అంటున్న డీకే అరుణతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖీ నిర్వహించారు. ఇందులో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మీరు గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. అందువల్లే ఇప్పుడు పార్టీ మిమ్మల్ని ఉపాధ్యక్ష పదవితో గౌరవించిందా? ఈ పదవి వస్తుందని ముందే ఊహించారా?

డీకే అరుణ: ఈ పోస్టు, ఆ పోస్టు అని డిమాండ్లు ఏమీ లేవు. నిబద్ధతతో పని చేస్తాను. నాకు కూడా పార్టీలో మంచి గుర్తింపు ఉంది. పార్టీకి కూడా నా పనితీరు తెలుసు. అందుకే నన్ను గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనన్నా బరిలోకి దింపారు. పార్టీ చాలాసార్లు నన్ను గుర్తించింది. అమిత్‌షా మంచి గుర్తింపును ఇచ్చారు. ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే పనిచేస్తా అని అడిగాను. పార్టీలో నమ్మకం ఉండి అవకాశం ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌షా, నరేంద్రమోదీకి ధన్యవాదాలు. 
బిహార్‌ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఈ కేంద్ర కమిటీలో కార్యవర్గ కూర్పును చూసుకుంటే గతంలో పని చేసిన రాంమాధవ్, మురళీధర్‌రావుకు చోటు దక్కకపోవడాన్ని ఎలా చూస్తారు?
డీకే అరుణ: పార్టీలోని నేతలు ఎప్పుడూ ఉన్నటువంటి హోదాలో ఉండాలనే నియమం ఉండదు. పార్టీలో అందరూ చర్చించే నిర్ణయం తీసుకుంటారు. దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి నాకు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురందేశ్వరికి అవకాశం ఇచ్చారు. రాజకీయంగా బలంగా ఉండి ప్రజల్లో ఉన్న మహిళలకు అవకాశాలు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారని అనుకుంటున్నా. తెలంగాణలో తెరాసకు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాదని గత ఎన్నికల్లో తేలిపోయింది. భాజపా రెండో సారి కేంద్రంలో అధికారంలోకి రావడం, పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు తెలంగాణలో రావడం, నేనూ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా భాజపా తెలంగాణలో బలోపేతమైంది. భవిష్యత్‌లో అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో భాజపా వైపు ప్రజలు చూస్తారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఏవిధంగా బలమైన నాయకత్వం అందిస్తున్నారో అటువంటి పాలనను రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. 
జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. మీకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ఎన్నికల ముందు ఇది ఏవిధంగా ప్రభావం చూపుతుంది? పార్టీ సన్నద్ధత ఎన్నికలకు ఏ విధంగా దోహదపడుతుంది?
డీకే అరుణ: కిషన్‌రెడ్డిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, లక్ష్మణ్‌ను జాతీయ స్థాయిలో ఓబీసీ సెల్‌ అధ్యక్షుడిగా నియమించారు. నాకు ఉపాధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భాజపా సన్నద్ధమైందని దీన్ని బట్టి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తప్పకుండా అధికారంలోకి వస్తాం అనే ఒక నమ్మకాన్ని భాజపా ఇస్తోంది. 10 సంవత్సరాలు తెరాస అధికారంలో ఉన్నా ఏం సాధించలేదు. కాళేశ్వరం, రైతుబంధు, రెండు పడక గదుల ఇళ్లు అని చెబుతున్నారు. ఇవన్నీ కలలుగానే ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పటిదాకా అమలు కాలేదు. ఎన్నికల ముందే గొర్రెలు ఇచ్చారు. ఇప్పుడు అవేం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఓటుకు నోటు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే శక్తి భాజపాలో ఉంది. 
మీతో పాటు 12 మందిని కేంద్ర కమిటీలో తీసుకున్నారు. జాతీయ స్థాయిలో మీ మార్క్‌ ఎలా ఉండబోతోంది?
డీకే అరుణ: జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చిన విధులు పూర్తి చేస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తాను.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని