Telangana News: మరోసారి అధికారంలోకి రావాలని రోజుకో వేషం వేస్తున్నారు: డీకే అరుణ

కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర, తెలంగాణ పేరు చెప్పి అమాయక..

Published : 18 Feb 2022 01:18 IST

హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర, తెలంగాణ పేరు చెప్పి అమాయక యువత చావులకు కేసీఆర్‌ కారకుడయ్యారని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు. సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్‌ అమరుల కుటుంబాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ కొత్త రాగం ఎత్తుకొని మరోసారి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమని భాజపా చెప్తే.. ఒక్క తెరాస నాయకుడు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. ఎదో విధంగా మరోసారి అధికారంలోకి రావాలని రోజుకో కొత్త వేషం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే, ఆంధ్ర, తెలంగాణను కలిపేస్తారని మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ బిల్లుకు భాజపా మద్దతు ఇవ్వకపోతే.. కాంగ్రెస్ బిల్లు పెట్టగలిగేదో లేదో తెలుసుకుంటే మంచిదని డీకే అరుణ హితవు పలికారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌.ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణను కలుపుతారని కేటీఆర్‌ మాట్లాడటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆ ఆలోచన ఉంది కాబట్టే కేటీఆర్‌, హరీశ్‌రావుతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల తెరాస వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమ, అభిమానం సన్నగిల్లిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గాలి నింపేందుకు ఆ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ ఆందోళనలు చేయిస్తున్నారని ప్రభాకర్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని