Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్‌..: డీకేఎస్‌

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Mar 2023 01:51 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్న వేళ పొత్తులపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ స్పందించారు.  అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపాను ఎదుర్కొనేందుకు జేడీఎస్‌తో పొత్తుపెట్టుకొనే అవకాశాలను ఆయన కొట్టిపారేశారు. తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. హంగ్‌ అసెంబ్లీకి అవకాశాల్లేవని.. జేడీఎస్‌తో పొత్తు, ఆ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలను తోసిపుచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదన్నారు. భాజపా కన్నా రెట్టింపు స్థానాలు కైవసం చేసుకుంటామని డీకేఎస్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 

ప్రజలు డిసైడ్‌ అయిపోయారు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాము కృషిచేశామని చెప్పారు.  సీఎం బసవరాజ్‌ బొమ్మై సారథ్యంలోని భాజపా ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యంతో పాటు అవినీతి, కుంభకోణాలకు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. తమకు కొత్త ప్రభుత్వ పాలన కావాలని ప్రజలు డిసైడ్‌ అయిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకొంటున్నారని.. అవినీతిని పెకలించాలని చూస్తున్నారన్నారు.  గ్లోబల్‌ కర్ణాటక, మెరుగైన బెంగళూరును జనం కోరుకుంటున్నారని చెప్పారు.  నాలుగేళ్ల డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఫెయిల్‌ అయిపోయిందని.. కర్ణాటక శ్రేయస్సుకోసం కొత్త ఇంజిన్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని