Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్‌ ఏమన్నారంటే..

ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయా? అన్న ప్రశ్నకు శరద్‌ పవార్‌ స్పందించారు. ఈ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మొదట డీఏంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను సంప్రదిస్తామన్నారు. 

Published : 27 Sep 2023 02:05 IST

ముంబయి: అన్నాడీఎంకే (AIADMK).. భాజపా (BJP)తో తెగదెంపులు చేసుకుని, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ‘ఇండియా (INDIA)’ కూటమిలోకి అన్నాడీఎంకేను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమిలోకి తీసుకురావడమనే విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మొదట డీఏంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను సంప్రదిస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) చెప్పారు. తమిళనాడులో డీఏంకే అధికార పార్టీగా ఉండగా.. అన్నాడీఏంకే ప్రతిపక్షంగా ఉన్న విషయం తెలిసిందే.

ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే కటీఫ్‌.. పార్టీ శ్రేణుల సంబరాలు!

అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమి కిందికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు శరద్‌ పవార్‌ బదులిస్తూ.. ‘ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఒక పార్టీ. కాబట్టి.. ఆ పార్టీని సంప్రదించకుండా అన్నాడీఎంకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోం’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయే, భాజపాతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే సోమవారం ప్రకటించింది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో 28 పార్టీలు ఉన్నాయి.

అప్పట్లోనే మహిళలకు రిజర్వేషన్లు..

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షాలు హృదయపూర్వకంగా మద్దతు పలికాయని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం దీని గురించి ప్రస్తావించలేదన్నారు. గతంలో మహారాష్ట్రలో, కేంద్రంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేసిందని గుర్తు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మహిళా బిల్లుకు మద్దతిచ్చాయని మధ్యప్రదేశ్ సభలో ప్రధాని మోదీ చెప్పిన నేపథ్యంలో శరద్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

తన నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం 1994లోనే స్థానిక సంస్థల్లో మహిళ రిజర్వేషన్లు  తీసుకొచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేపట్టిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు త్రివిధ దళాల్లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించామని పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు