Mallikarjun Kharge: రావణుడిలా మీకేమైనా 100 తలలు ఉన్నాయా?: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు

గుజరాత్‌ తొలి విడత ఎన్నికల(Gujarat election2022) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనున్న వేళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Nov 2022 16:05 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ తొలి విడత ఎన్నికల(Gujarat election2022) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనున్న వేళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘రావణుడు’తో పోల్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. తనను చూసి ఓటేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను కోరుతూ ఎన్నికల క్యాంపెయిన్‌ నిర్వహించడంతో ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘మోదీజీ ప్రధానమంత్రి. తన పని మరిచిపోయి.. కార్పొరేషన్‌ ఎన్నికలు, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ప్రతిచోటా ప్రచారం చేస్తున్నారు. అన్ని వేళలా తన గురించే మాట్లాడతారు. నన్నే చూసి ఓటేయండి.. ఇంకెవరినీ చూడనవసరంలేదని అంటున్నారు. మోదీజీ మీ ముఖాన్ని మేం ఎన్నిసార్లు చూడాలి? మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? రావణుడిలా మీకేమైనా 100 తలలు ఉన్నాయా?’’ అని ఖర్గే అన్నారు. అహ్మదాబాద్‌లోని బెహ్రంపూర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు నవ్వులు, చప్పట్లతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు.

ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగారన్నారు. అవి మున్సిపాలిటీ ఎన్నికలైనా, కార్పొరేషన్‌, అసెంబ్లీ ఎన్నికలైనా సరే అభ్యర్థి పేరు మీద ప్రజల్ని ఓట్లుఅడగాలి. మోదీ వచ్చి ఏమైనా మున్సిపాలిటీకి పనిచేస్తారా? మీకు అవసరమైన సమయాల్లో ఆయన మీకు సాయం అందించగలరా? అని ఖర్గే ప్రశ్నించారు. 

ఖర్గే వ్యాఖ్యలపై భాజపా ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ట్విటర్‌లో దీటుగా స్పందించారు. గుజరాత్‌ ఎన్నికల వేడిని తట్టుకోలేక పక్కకు పోయిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తన మాటలపై నియంత్రణ కోల్పోయారన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ గుజరాత్‌ పుత్రుడిని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. 2007 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సోనియా గాంధీ కూడా 2002 అల్లర్లను ఉద్దేశించి మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌ మాలవీయ ప్రస్తావించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని