Sisodia: ‘భాజపా ట్రాప్‌లో పడొద్దు.. ఇప్పుడు ఫ్రీ అంటారు.. ఆ తర్వాత..!’

హిమాచల్‌ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్కు పాలనను కాపీ కొడుతోందని ఆప్‌ ఆరోపించింది. ఉచిత విద్యుత్‌, నీటి......

Published : 16 Apr 2022 02:05 IST

హిమాచల్‌ సీఎం ప్రకటనపై సిసోడియా విమర్శలు

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్కు పాలనను కాపీ కొడుతోందని ఆప్‌ ఆరోపించింది. ఉచిత విద్యుత్‌, నీటి బిల్లులు రద్దు.. బస్సుల్లో మహిళలకు 50శాతం రాయితీ ఇస్తామంటూ హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ ప్రకటించిన కొద్దిసేపటికే ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భాజపా ఎప్పుడూ ఉచిత విద్యుత్‌ వంటి వాటికి పూర్తి వ్యతిరేకమని చెబుతుంటుందని గుర్తుచేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వస్తే.. వీటన్నింటినీ వెనక్కి తీసుకుంటుందన్నాని విమర్శించారు. ప్రజలెవరూ భాజపా ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేయాలని కోరారు. 

ఆ 18 రాష్ట్రాల్లో అలాంటి ఆలోచనేలేదు!

చంబా ప్రాంతంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సీఎం జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ప్రజలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో నీటి బిల్లులు మాఫీ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే, మహిళలకు బస్సు ఛార్జీలో 50శాతం తగ్గిస్తున్నట్టు చెప్పారు. దీనిపై మనీశ్‌ సిసోడియా స్పందిస్తూ.. దిల్లీలో కేజ్రీవాల్‌ తరహా పాలనను కాపీ కొడుతూ భాజపా ఎన్నికలకు ముందు డ్రామాలాడుతోందన్నారు. దేశంలో భాజపా, దాని మిత్రపక్షాలు కలిపి 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయనీ.. ఆయా చోట్ల ఎక్కడా తక్కువ ధరకు విద్యుత్‌ అందించాలనే ఆలోచన చేయలేదని విరుచుకుపడ్డారు. ఎక్కడా ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పలేదన్నారు. పైగా భాజపా ఇలాంటి ఉచితాలను ఎగతాళి చేస్తుందన్నారు. కేజ్రీవాల్‌, ఆప్‌ భయం పట్టుకుందనీ.. ఎన్నికల్లో ఓడిపోతామనే ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉచితాలు ప్రకటిస్తున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని