Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్‌ సూచన

లోక్‌సభలో అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు గళమెత్తుతున్నాయి. తాజాగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రంపై ఆరోపణలు చేయడంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హెచ్చరికలు జారీ చేశారు. ఆధారాలతో ఆరోపణలు చేయాలన్నారు.

Updated : 08 Feb 2023 17:44 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌(Adani group) వ్యవహారంపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గౌతం అదానీ(Gautam adani)కి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam kumar Reddy) లోక్‌సభ(Lok sabha)లో చేసిన ఆరోపణలపై స్పీకర్‌ ఓం బిర్లా(Om birla) హెచ్చరించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు. గత 10 రోజుల్లో రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కుప్పకూలిందని.. కేంద్ర ప్రభుత్వం దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు అంగీకరించాలన్నారు. లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు.ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయరాదని సూచించారు. ‘‘మీరు వాస్తవాలు, ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారు. సభ మర్యాదను కాపాడేలా నడుచుకోవాలి’’ అని హెచ్చరించారు. అయితే, దీనిపై స్పందించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. సభకు సమర్పిస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్‌.. ‘‘మనం  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తున్నాం. కానీ మీరు ఒక్క వ్యక్తి గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. బహుశా అదే మీకు ఇష్టం కావొచ్చు. కానీ దేశానికి కాదు’’ అని వ్యాఖ్యానించారు. విమర్శలు, ఆరోపణలు చేయడానికి మధ్య తేడా ఉంటుందన్న ఆయన.. ‘‘మీరు విమర్శించండి.. కానీ మీరు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలి’’ అన్నారు. మరోవైపు, నిన్న రాహుల్‌ గాంధీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి మోదీ, అదానీ కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శించగా స్పీకర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని