Mayawathi: రాష్ట్రపతి కాదు.. ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నా..!

రాష్ట్రపతి అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తోసిపుచ్చారు.

Published : 29 Apr 2022 02:23 IST

అఖిలేశ్‌ యాదవ్‌కు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కౌంటర్‌

దిల్లీ: రాష్ట్రపతి అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తోసిపుచ్చారు. రాష్ట్రపతి కావాలని తాను ఎన్నడూ కోరుకోలేదని అన్నారు. తాను లేకుంటే యూపీ సీఎంగా మార్గం సుగమం అవుతుందనే ఆశతోనే అఖిలేశ్‌ అటువంటి వాదన చేస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా తాను రాష్ట్రపతి కాకుండా ఏదో ఒకరోజు దేశప్రధాని కావడమో లేదా యూపీ ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నిక కావాలనే కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

‘రాబోయేరోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిని లేదా దేశానికి ప్రధాని కావాలని కలలు కంటాను. అంతేకానీ రాష్ట్రపతి కావాలని ఎన్నడూ కోరుకోవడం లేదు’ అని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. తాను ఎన్నడూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపలేదన్న ఆమె.. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరామ్‌ చూపిన మార్గంలో నడుస్తూ అణగారిన ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి లేదా పీఎం కావడం వల్లనే ఇది సాధ్యమవుతుందని.. రాష్ట్రపతి అవడం వల్ల సాధ్యం కాదనే విషయం అందరికీ తెలుసునన్నారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసమే తనను రాష్ట్రపతి చేయాలని సమాజ్‌వాదీ పార్టీ కోరుకుంటోందని మాయావతి ఆరోపించారు. ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నప్పటికీ రాష్ట్రంలో ఎస్‌పీ అధికారంలోకి రాలేకపోయిందని మాయావతి విమర్శలు గుప్పించారు.

ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ఘోర పరాజయం పాలైంది. కేవలం ఒకేఒక్క సీటు సాధించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌పీ ఓటుబ్యాంకు మొత్తం భాజపావైపు మొగ్గినట్లు వార్తలు వినిపించాయి. మరోవైపు ఎన్నికల సమయంలోనూ బీఎస్‌పీ, భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే భాజపా మద్దతుతో రాష్ట్రపతి కావాలని మాయావతి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతోంది. అఖిలేశ్‌ యాదవ్‌ చేస్తోన్న ఈ వాదనను బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని