డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి: మోదీ

కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండటంతో అసోంలో డబుల్‌ ఇంజిన్‌ తరహాలో ప్రభుత్వం పనిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందడుగు పడ్డాయని చెప్పారు.

Updated : 23 Feb 2024 19:08 IST

గువహటి: కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉండటంతో అసోంలో డబుల్‌ ఇంజిన్‌ తరహాలో ప్రభుత్వం పనిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని బోకాఖాత్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అసోంను కాంగ్రెస్‌ 50ఏళ్లు పాలించి కూడా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

‘అసోంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఎన్డీయే ప్రభుత్వంపై ఇక్కడి ప్రజలు పెట్టుకున్న అంచనాల్ని నెరవేర్చాం. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదిపై ఇరువైపులా అనుసంధానం చేసేలా ఎన్నో వంతెనలు నిర్మితమవుతున్నాయి. గతంలో అసంపూర్తిగా ఉన్న వంతెనలు సైతం పూర్తవుతున్నాయి. మేం కేవలం ప్రజల సౌకర్యాల కోసమే కాదు.. జంతువుల సంరక్షణకూ శ్రమిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఖడ్గ మృగాలను వేటాడే వారిని జైళ్లలో పెట్టాం. గత ఐదేళ్లలో అసోంలో అటవీ శాతం కూడా పెరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. దీంతో పర్యాటక రంగంలోనూ అవకాశాలు మెరుగయ్యాయి. టీ తోట కార్మికులకు ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సైతం ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి రోజువారీ కూలీ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని మోదీ వెల్లడించారు. 

కాంగ్రెస్‌ది కేరళలో కుస్తీ, బెంగాల్‌లో దోస్తీ

‘కాంగ్రెస్‌ దశాబ్దాల పాటు అసోంలో అధికారంలో ఉన్నప్పటికీ.. టీ తోట కార్మికులను ప్రతికూల పరిస్థితుల్లోనే వదిలేసింది. కాంగ్రెస్‌ నాయకులు తాము లౌకికవాదులుగా అభివర్ణించుకుంటారు. కానీ పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళలో వర్గాల వారీగా స్నేహం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. వారు అధికార మోజుతో కేరళలో వామ పక్షాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తారు.. మళ్లీ ఇటు పశ్చిమబెంగాల్‌లో వారితోనే స్నేహం చేస్తారు. దాదాపు 50 ఏళ్లకు పైగా అసోంను పాలించిన వారు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు హామీలు ఇస్తున్నారు. తప్పుడు వాగ్దానాలు, ప్రకటనలు చేయడం వారికి అలవాటే’అని కాంగ్రెస్‌పై మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

అసోం శాసనసభలో 126 స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6వరకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని