municipal elections: గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది.

Updated : 04 Jul 2024 05:10 IST

వీడని చిక్కుముడులు
చట్టంలో ఖరారు కాని నియమావళి

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం సైతం అభిప్రాయపడుతోంది. నిబంధనల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మినహా మిగిలిన 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే జనవరి నుంచి కొంతకాలం పాటు ప్రత్యేకాధికారుల పాలన తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన చిక్కుముడి బీసీ జనాభా గణనతో వస్తుందని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019ను అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోదించినప్పటికీ నియమ, నిబంధనలు (రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌) రూపొందించలేదు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందుగానే బీసీ జనాభా గణన చేపట్టి.. తరవాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కార్యరూపంలో తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అంచనా.   

6 నుంచి 9 నెలల వరకు.. 

రాష్ట్రమంతటా బీసీ జనాభా గణన నిర్వహించేందుకు కనీసం 6 నుంచి 9 నెలలు వరకు పడుతుందని అధికారులంటున్నారు. ఆ గణనపై ఎవరైనా మళ్లీ కోర్టును ఆశ్రయిస్తే ఏమిటన్న ప్రశ్న కూడా  చర్చనీయాంశంగా ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ అయితే కొంతమేరకు స్పష్టత వస్తుంది.కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల విభజన చేయాల్సి ఉంది. ములుగు, ఆసిఫాబాద్‌ మరికొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలుగా స్థాయిపెంచుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమలుపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా నూతన మున్సిపల్‌ చట్టాన్ని గత భారాస ప్రభుత్వ హయాంలో రూపొందించారు. నియమావళిని ఖరారు చేయలేదు.దీంతో మున్సిపల్‌ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం విషయంలో పెద్ద సమస్య ఎదురయింది. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. నియమావళిని రూపొందించని కారణంగా మునుపటి చట్టంలో ఉన్న వాటినే ప్రామాణికంగా తీసుకుని అవిశ్వాస తీర్మానాలపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆ విషయం కొలిక్కి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం నిపుణులను నియమించి ఆ నియమావళిని రూపొందించని పక్షంలో మళ్లీ చిక్కుముడులు తప్పవని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని